కాంగ్‌కి టీ భయం, రాహుల్ పేరు చెప్పలేక: మోడీ సెటైర్
న్యూఢిల్లీ: టీ అమ్ముకునే వాడికి కాంగ్రెసు పార్టీ భయపడుతోందని గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఆదివారం కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో మూడో రోజు జరుగుతున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో మోడీ ప్రసంగించారు. గతంలో జరిగిన ఎన్నికలకు 2014 ఎన్నికలకు చాలా తేడా ఉందన్నారు. కాంగ్రెసు నేతలు పార్టీని రక్షించుకోవాలని చూస్తుంటే, మనం దేశాన్ని రక్షించాలని చూస్తున్నామన్నారు.
2014 ఎన్నికలు చాలా భిన్నమైనవన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదరికంతో ప్రజలు అలమటిస్తున్నారన్నారు. నాడు స్వరాజ్యం కోసం అందరు ఏకమైతే, ఇప్పుడు సురాజ్యం కోసం ఏకం అవుతున్నామన్నారు. ఇంతటి చీకటి రోజులను దేశ ప్రజలు ఎప్పుడు చూడలేదన్నారు. మొన్నటి సమావేశంలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుందనుకుంటే గ్యాస్ సిలిండర్ల పేరుతో వెనక్కి పోయిందని ఎద్దేవా చేశారు.

ఇందిర గాంధీ చనిపోయినప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసి హడావుడిగా రాజీవ్ గాంధీని ప్రధానిని చేశారని, ఆయన చనిపోయాక సోనియాను అధ్యక్షురాలిని చేస్తే, ఆమె మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా చేశారని, ఇదేనా ఆ పార్టీ సంప్రదాయమని ప్రశ్నించారు. ఏ తల్లీ తన కొడుకును బలిపీఠం ఎక్కించాలని కోరుకోదని, 2014 ఎన్నికల్లో గెలవమని తెలిసే రాహుల్ గాంధీని ప్రధానిగా ప్రకటించేందుకు సోనియా గాంధీ విముఖత చూపారని విమర్శించారు.
కాంగ్రెసు పార్టీ పేర్లు చెప్పుకొని కాలం వెళ్లదీస్తే, మనం పని చేసే రకమన్నారు. దేశంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, ఒక ప్రాంతం వెనుకబడి మరో ప్రాంతం అభివృద్ధి చెందడం కాదన్నారు. ప్రాంతీయ ఆకాంక్షల్ని ఢిల్లీ కాంగ్రెసు పెద్దలు ఎప్పుడు పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్ర కేబినెట్ ఒక్కటే నిర్ణయాలు తీసుకుంటే చాలదని, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కూడా కావాలన్నారు. దేనికైనా కావాల్సింది కమిటీలు కాదని, చిత్తశుద్ధి అన్నారు.
దేశాన్ని పక్కన పెట్టి పార్టీని కాపాడుకోవడంలో కాంగ్రెసు పార్టీ బిజీగా ఉందన్నారు. సిఎంగా తనకు రాష్ట్రాల సాధికారత గురించి అవగాహన ఉందన్నారు. పేదలు, సామాన్యుల కోసమే సుపరిపాలన అని చెప్పారు. ప్రస్తుతం దేశంలో సమర్థ పాలన, నాయకత్వం లేదన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ప్రధానిగా చేసేందుకు కాంగ్రెసు నాడు భయపడిందన్నారు. టి అమ్ముకునే ప్రతి వ్యక్తి సగర్వంగా తిరుగుతున్నారన్నారు. టి అమ్ముకునే వ్యక్తులను కించపర్చడం కాంగ్రెసుకు సరికాదన్నారు.
సమాజాన్ని విడదీసి అధికారంలోకి రావాలన్నది కాంగ్రెసు పార్టీ ఉద్దేశ్యమైతే, అందరినీ ఐక్యం చేసి అభివృద్ధి చేయాలన్నది తమ లక్ష్యమన్నారు. కాంగ్రెసు పార్టీకి దేశం అంటే తేనెతుట్టె అని తమకు మాత్రం కన్నతల్లి వంటిందన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తామన్నారు. నల్లధనంపై అద్వానీ పోరాటం చేశారని, ఆయన కల నెరవేరుస్తామన్నారు. మహిళలను గౌరవించడం, భద్రత కల్పించడం అందరి బాధ్యత అన్నారు. అధికారంలోకి రాగానే ధరల నియంత్రిస్తామన్నారు.












Click it and Unblock the Notifications