మూడు ఏకేలు దేశానికి ప్రమాదం: మోడీ, కేజ్రీపై ఫైర్
శ్రీనగర్: భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తొలిసారి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రివాల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘భారత్ విజయ్' యాత్రను జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఉధంపూర్‌లో ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. లోకసభ ఎన్నికల నేపథ్యంలో నరేంద్ర మోడీ 185 ర్యాలీల్లో ప్రసంగించనున్న విషయం తెలిసిందే.
ఉధంపూర్ బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ.. మూడు ఏకేలు దేశానికి ప్రమాదకరంగా మారాయని అన్నారు. అందులో ఒకటి ఏకె-47 కాగా, రెండోది కేంద్రమంత్రి ఏకె అంటోనీ, మూడోది ఏకె-49 (అరవింద్ కేజ్రివాల్) అని తెలిపారు. ఈ మూడు ఏకేలు పాకిస్థాన్‌కు సహకరిస్తున్నాయని మోడీ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వెబ్‌సైట్‌లో జమ్మూకాశ్మీర్‌ను పాకిస్థాన్ దేశంలో చూపారని ఆరోపించారు.

ఆప్ సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని మోడీ ఆరోపించారు. ఆప్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత జమ్మూకాశ్మీర్‌పై రెఫరెండం నిర్వహించాలని కోరుతున్నారని విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ పాకిస్థాన్ బాణీని వినిపిస్తోందని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఈ మూడు ఏకేలు కూడా పాకిస్థాన్‌కు సహకరించడం ఆ దేశ అదృష్టమని, ఇదంతా మనం గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి ఆలోచనా శక్తి లేదని, ప్రస్తుతం ఆ పార్టీ ఆలోచనా రహితంగా మారిందని మోడీ ఆరోపించారు. జమ్మూకాశ్మీర్ అయినా లేదా లడక్ అయినా, దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్‌కు వ్యతిరేక గాలి వీస్తోందని, అదే సమయంలో కమలం హవా కొనసాగుతోందని తెలిపారు. తమది ఒకటే నినాదమని చెప్పిన ఆయన, అది అభివృద్ధి మంత్రమని చెప్పారు.
60 నెలలపాటు ప్రధాని కూర్చిలో కూర్చుని ఎంజాయ్ చేయడానికి అధికారంలోకి రావాలనుకోవడం లేదని.. ప్రజలకు, దేశానికి వాచ్‌మన్‌లా ఉండటానికేనని మోడీ తెలిపారు. ఇప్పటికే 60ఏళ్లపాటు వరకు రాజుల(పాలకుల)కు అధికారం ఇచ్చారు.. ఈ 60 నెలలు సేవకునికి అవకాశమివ్వాలని మోడీ ప్రజలను కోరారు.












Click it and Unblock the Notifications