కార్లు ఢీ: స్మృతి ఇరానీకి తృటిలో తప్పిన ప్రమాదం
ఢిల్లీ: కేంద్రమంత్రి, బిజెపి నేత స్మృతి ఇరానీ రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. శనివారం అర్థరాత్రి యమునా ఎక్స్‌ప్రెస్ హైవే పైన ఆమె వాహనశ్రేణిలో దేశ రాజధాని ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఆమె ప్రయాణిస్తున్న వాహనం ముందున్న పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు.

ప్రమాదం నుంచి తాను క్షేమంగా బయటపడినట్లు స్మృతి ఇరానీ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా తెలిపారు. యమునా ఎక్స్‌ప్రెస్ వే పై నుంచి స్మృతి కాన్వాయ్ వెళ్తుండగా... ట్రాఫిక్ జాం అయింది. దీంతో స్మృతి కాన్వాయ్‌లోని ముందు వాహనాలు సడన్ బ్రేక్ వేశాయి. దీంతో ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో ఆమె ఎడమ ముంజేయి, కుడి కాలికి స్వల్పంగా గాయమైంది. ఆమె అక్కడికి అక్కడే ప్రథమ చికిత్స చేయించుకున్నారు. అనంతరం ఢిల్లీకి వెళ్లారు. ట్విట్టర్ ద్వారా తన క్షేమ సమాచారాన్ని తెలిపారు. గాయపడిన వారు ఆసుపత్రికి చేరుకున్నారని తెలిసిన తర్వాతే ఆమె ఢిల్లీకి వెళ్లారు.












Click it and Unblock the Notifications