నవజ్యోత్ సింగ్ సిద్ధుకు పంజాబ్ పార్టీ పగ్గాలు?: సీఎంతో విభేదాలు, ఆప్ చర్యలతో కాంగ్రెస్ అప్రమత్తం
న్యూఢిల్లీ/ఛండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, అమృత్‌సర్ తూర్పు ఎమ్మెల్యే నవజోత్ సింగ్ సిద్దు మధ్య విభేదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరికీ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే నవజ్యోత్ సింగ్ సిద్ధుకు పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
పంజాబ్ కోసం తాను ఏం చేశానో, ఏం చేయగలనో ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తించిందని, తన సామర్థ్యం, విజన్‌ను మెచ్చుకుంటోందని నవజ్యోత్ సింగ్ సిద్ధు వ్యాఖ్యానించడం పట్ల కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే సిద్దును బుజ్జగించే పనిలో పడింది.
కాగా, నవజోత్ సింగ్ సిద్దు కాంగ్రెస్ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీని కూడా కలిశారు.

ఈ నేపథ్యంలోనే పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను నవజ్యోత్ సింగ్ సిద్దుకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు పంజాబ్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జీ హరీశ్ రావత్ బుధవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో సిద్దుకు పంజాబ్ పార్టీ బాధ్యతలు అప్పగించే అంశంపై చర్చించినట్లు సమాచారం.
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌కు రాహుల్ గాంధీ అండదండలుండగా, నవజోత్ సింగ్ సిద్ధుకు మద్దతుగా ప్రియాంక గాంధీ ఉంటడం గమనార్హం. పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న అమరీందర్, నవజ్యోత్ సింగ్ సిద్ధుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఈ ఇద్దరు నేతలు ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సిద్దుకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు పంజాబ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ నవజ్యోత్ సింగ్ సిద్దుకు గాలం వేస్తున్నట్లు కనిపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది.












Click it and Unblock the Notifications