లోక్ సభ స్పీకర్, డిప్యూటీ పదవులపై ఏకాభిప్రాయానికి ఎన్డీయే, ఇండియా! అభ్యర్ధులు వీరే..?
కొత్త పార్లమెంట్ కొలువుదీరిన వేళ కీలకమైన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులపై మొండిపట్టు పట్టిన అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటములు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకూ తమకున్న మెజార్టీ నేపథ్యంలో ఈ రెండు కీలక పదవుల్ని తామే తీసుకుంటామని చెప్తూ వచ్చిన ఎన్డీయే.. తొలిసారి ఏకాభిప్రాయానికి భిన్నంగా వెళ్తుందని భావించారు. కానీ సంప్రదాయం ప్రకారం డిప్యూటీ పదవిని విపక్షాలకు ఇచ్చేందుకు ఎన్డయే అంగీకరించినట్లు సమాచారం.

లోక్ సభ స్పీకర్ పదవి విషయంలో ఎన్డీయే మొండిపట్టు కొనసాగిస్తే పోటీగా తమ అభ్యర్ధిని నిలబెట్టేందుకు విపక్ష ఇండియా కూటమి సిద్దమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ సూచన మేరకు కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిరణ్ రిజిజు ఏకాభిప్రాయం కోసం విపక్షంతో చర్చలు జరిపారు. ఇవి ఫలించడంతో తమ అభ్యర్ధిని నిలబెట్టకూడదని విపక్ష ఇండియా కూటమి నిర్ణయించింది. దీంతో ఉమ్మడి అభ్యర్ధిగా ఏకాభిప్రాయంతో స్పీకర్ ఎంపిక జరగబోతోంది. అలాగే డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు దక్కబోతోంది.
స్పీకర్ పదవికి గత లోక్ సభలో స్పీకర్ గా పనిచేసిన ఓంబిర్లాకు మరో అవకాశం ఇచ్చే దిశగా ఎన్డీయే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవిని మాత్రం 2019 నుంచి ఎన్డీయే ఖాళీగా ఉంచేసింది. ఈసారి మాత్రం విపక్షం బలంగా ఉండటంతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల్ని పంచుకోవాలని అధికార, విపక్షాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్పీకర్ పదవికి ప్రస్తుత ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ పేరును కూడా ఎన్డీయే పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకూ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది.












Click it and Unblock the Notifications