Year Ender 2023: పతాకస్ధాయికి ఎన్డీయే-విపక్షాల పోరు-ఏకంగా 100 ఎంపీల సస్పెన్షన్ దాకా..!
పార్లమెంట్ లో ఈ ఏడాది సాగిన సమావేశాలన్నీ దాదాపు మూస పద్ధతిలో సాగిపోయాయి. దేశ అత్యున్నత ప్రజాస్యామ్య సౌధంలో కీలక బిల్లులపై నిర్మాణాత్మక చర్చలు జరగడం కానీ, వాటికి కేంద్రం, విపక్షాలు సహకరించుకోవడం కానీ జరగలేదు. పార్లమెంట్ బయట చోటు చేసుకున్న పరిణామాలు సభల్లో ప్రతిబింబించడం, వాటిపై విపక్షాలు నిరసనలకు దిగడం, ఎంపీల్ని కేంద్రం తమకున్న మందబలంతో సస్పెన్షన్లు చేసుకుంటూ పోవడం ఈ ఏడాదంతా కనిపించింది. ఇవాళ ఇది పరాకాష్టకు చేరింది.
పార్లమెంట్ ఈ ఏడాది భేటీ అయిన ప్రతిసారీ ఒకే తరహా దృశ్యాలు కనిపించాయి. వర్షాకాలమైనా, శీతాకాలమైనా, బడ్జెట్ అయినా ఏ సమావేశమైనా విపక్షాలు నిరసనలకు దిగడం, కేంద్రం సస్పెన్షన్లకు దిగడం సర్వసాధారణంగా మారిపోయింది. దీనికి బదులు విపక్షంతో సభ బయట చర్చించే సంప్రదాయాలకు తెరపడినట్లయింది. అలాగే విపక్షాలు కూడా మొండిపట్టు పట్టడంతో కేంద్రం కూడా చేసేదేమీ లేకుండా పోయింది.

తాజాగా కేంద్రం కొత్త పార్లమెంట్ ను ప్రారంభించింది. స్వాతంత్ర అమృతోత్సవాల వేళ కొత్త పార్లమెంట్ భవనంలోకి మారిన అధికార, విపక్షాల తీరులో ఎలాంటి మార్పూలేదు. కొత్త పార్లమెంట్ లోనూ అదే పరిస్ధితి కనిపించింది. చివరకు కేంద్రం దుర్భేద్యంగా కట్టామని చెప్పుకున్న పార్లమెంట్ లోకి తాజాగా నలుగురు చొరబడటం సాధారణ ప్రజలకు కూడా ప్రజాస్వామ్య సౌధం భద్రతపై అనుమానాలు రేకెత్తించింది. చివరకు ఈ ఘటన కూడా ఎన్డీయే, విపక్షాల మధ్య పోరుగా మారిపోయింది.
పార్లమెంట్ లో భద్రతా ఉల్లంఘన చోటు చేసుకున్న తర్వాత కేంద్రం నుంచి ప్రకటన వస్తుందని ఆశించిన విపక్షాలకు చుక్కెదురైంది. ప్రధాని కానీ, హోంమంత్రి కానీ ఇంతటి కీలకమైన వ్యవహారంపై ప్రకటన చేయకపోవడంతో విపక్షాలు కొన్ని రోజులుగా నిరసనలకు దిగుతూ సభా కార్యకలాపాల్ని అడ్డుకుంటున్నాయి. అయినా కేంద్రం స్పందించకపోవడంతో ఇవాళ మరింత రచ్చ చేశాయి. దీంతో ఉభయసభల్లో కలిపి దాదాపు 100 మంది విపక్ష ఎంపీల్ని కేంద్రం సస్పెండ్ చేయించేసింది. ఈ అనూహ్య ఘటన పార్లమెంట్ ఎన్నికలకు ముందు అధికార, విపక్షాల మధ్య నెలకొన్న పోరు తీవ్రతను తెలియజేసేలా ఉంది.












Click it and Unblock the Notifications