Mamata meets Sonia: కలిసి పోరాడుదాం, మోదీ-బీజేపీని కూల్చేద్దాం -గాంధీలతో మమత చాయ్ పే చర్చ
విపక్షాలకు సంబంధించి ఏడేళ్లుగా ఎదురు చూస్తోన్న తరుణం రానే వచ్చింది. అత్యంత శక్తిమంతుడిలా మారిన ప్రధాని నరేంద్ర మోదీని, ఆయన ఇమేజ్ తో ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ఢీకొట్టేలా విపక్షాల ఉమ్మడి కార్యాచరణకు రంగం సిద్ధమైంది. 2024 ఎన్నికల్లో ఎన్డీఏను నిలువరించేలా విపక్షాలన్నీ ఒకతాటిపైకి రావాలనే ప్రాథమిక అంగీకారం కుదిరింది. ఇప్పటికే కాంగ్రెస్ సహా 14 పార్టీలు కలిసి నిరసనలు చేస్తుండగా, విపక్ష కూటమికి లీడర్షిప్ ఫేస్ కూడా దాదాపు ఖరారైంది..
Recommended Video
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ-షా ద్వయాన్ని ఢీకొట్టినమమతా బెనర్జీ, తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల ప్రధాని అభ్యర్థిగానూ నిలబడతారనే అంచనాల నడుమ, బుధవారం ఢిల్లీలో కీలక భేటీ జరిగింది. టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలుసుకున్నారు. 10 జన్ పథ్ లో 'చాయ్ పే చర్చ' తరహాలో జరిగిన ఈ భేటీలో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు..

మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వచ్చిన మమతా బెనర్జీ, మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీని కలవడం, మమత ఢిల్లీలో అడుగుపెట్టిన తర్వాత విపక్షాల ఉమ్మడి పోరాటం మరింత ఉధృతంగా మారడం తెలిసిందే. ఇవాళ సోనియా ఇంటికెళ్లిన దీదీ.. దాదాపు 45నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఇకపై కలిసికట్టుగా పోరాడాలని, 2024 ఎన్నికల్లో మోదీ-బీజేపీని ఓడించే లక్ష్యంతోనే పని చేద్దామని ఇద్దరు నేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
సోనియా గాంధీతో మీటింగ్ తర్వాత మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. ''సానుకూల వాతావరణంలో ఈ సమావేశం జరిగింది. బీజేపీని ఓడించేందుకు ప్రతిఒక్కరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇలా అన్ని పక్షాలు కలిసి పోరాటం చేయాలి'' అని చెప్పారు. కాగా, బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు చేసే పోరాటానికి నాయకత్వం వహిస్తారా అన్న ప్రశ్నకు.. ''నేను రాజకీయ జోతిష్కురాలిని కాదు..'' అంటూ మమత తెలివిగా సమాధానమిచ్చారు.












Click it and Unblock the Notifications