దక్షిణ భారతదేశ హైస్పీడ్ రైలు హబ్‌గా హైదరాబాద్.. ముంబైకి మూడు గంటల్లోనే!
హైదరాబాద్ నుంచి ముంబై వరకు ప్రయాణం చేసే ప్రయాణికులకు ఇది అత్యంత సంతోషకరమైన వార్త. హైదరాబాద్-పుణె-ముంబై మధ్య ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్‌కు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) పూర్తిగా సిద్ధమైంది. ఈ డీపీఆర్ కు కేంద్రం ఆమోదిస్తే బుల్లెట్ రైలు పట్టాలెక్కుతుంది. ఈ రైలు ప్రయాణం ప్రస్తుతం 12-15 గంటలు పట్టే ప్రయాణం కేవలం 3 గంటలకు తగ్గనుంది.
దక్షిణ భారతదేశ రవాణా వ్యవస్థలో ఒక మైలురాయి
గంటకు 300 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ బుల్లెట్ ట్రైన్ దక్షిణ భారతదేశ రవాణా వ్యవస్థలో ఒక మైలురాయి అవుతుంది. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి ఈ సమాచారం అందించారు. క్షేత్ర స్థాయి సర్వేలు పూర్తి చేసిన తర్వాత DPR సిద్ధం కావడం ఈ ప్రాజెక్టు త్వరగా ముందుకు సాగడానికి దోహదపడుతుంది.

బుల్లెట్ రైల్ కారిడార్ సాగుతుందిలా
మొత్తం 671 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్‌లో తెలంగాణలో 93 కి.మీ, కర్ణాటకలో 121 కి.మీ, మహారాష్ట్రలో 457 కి.మీ మార్గం ఉంటుంది. ఎక్కువ భాగం ఎత్తైన పిల్లర్లపై ఎలివేటెడ్ ట్రాక్‌గా నిర్మించనున్నారు. పశ్చిమ కనుమల ప్రాంతంలోని ఖండాల ఘాట్‌లో 13 సొరంగాలు 24 కి.మీ మేర నిర్మించాల్సి ఉంది. అలాగే మహారాష్ట్రలో సుమారు 35 కి.మీ మేర భూగర్భ మార్గం కూడా ప్రతిపాదించారు.
స్టేషన్లు ఇలా
మార్గంలో 101 వంతెనలు, ఇందులో 29 ప్రధాన వంతెనలు ములా-ముఠా, భీమా, బోరి నదులపై నిర్మించనున్నారు. ఈ అధునాతన డిజైన్‌తో ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. తెలంగాణలో కోకాపేట, వికారాబాద్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. కర్ణాటకలో కలబురిగి, మహారాష్ట్రలో విఖ్రోలి, థానే, నవీ ముంబై, లోనావాలా, పుణె, బారామతి, పంఢర్‌పుర్, సోలాపుర్‌తో సహా మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి.
భూసేకరణ, బుల్లెట్ రైలు సేవలు ఇలా
ప్రతి స్టేషన్‌కు సుమారు 247 ఎకరాల భూమి అవసరం. అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ పార్కింగ్, వాణిజ్య సదుపాయాలతో ఈ స్టేషన్లు నిర్మించనున్నారు. ప్రారంభ సంవత్సరంలో రోజుకు సుమారు 63,500 మంది, 2041 నాటికి 95,000 మంది, 2061 నాటికి 1.52 లక్షల మంది ప్రయాణికులు ఈ బుల్లెట్ రైల్ సేవలను ఉపయోగించుకోవచ్చని అంచనా. ప్రతి రైలులో 16 బోగీలు, 1,215 సీట్లు ఉంటాయి. థానే మరియు హైదరాబాద్‌లో డిపోలు, వర్క్‌షాపులు ఏర్పాటు చేస్తారు.
దక్షిణ భారతదేశ హైస్పీడ్ రైలు హబ్‌గా హైదరాబాద్
రోడ్లు మరియు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ ప్రాజెక్టును "గేమ్ చేంజర్"గా అభివర్ణించారు. వాణిజ్యం, పర్యాటకం, ఉపాధి అవకాశాలు పెరిగి, హైదరాబాద్‌ను దక్షిణ భారతదేశ హైస్పీడ్ రైలు హబ్‌గా మార్చుతుంది.DPR సిద్ధమైనందున కేంద్ర అనుమతులు, భూసమీకరణ, ఆర్థిక వనరులు, ఇతర రాష్ట్రాలతో సమన్వయం కీలకం. ఈ మెగా ప్రాజెక్టు దేశ రవాణా రంగాన్ని ఆధునికీకరించడంతో పాటు, ప్రాంతీయ అభివృద్ధికి బలం చేకూరుస్తుంది.













Click it and Unblock the Notifications