దేశంలో కరోనా కొత్త వేరియంట్.. కొత్త లక్షణాలు కూడా; జాగ్రత్త!!
దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్రం రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమైనా ప్రజలు ఇంకా అప్రమత్తంగా లేకపోవడం ప్రధానంగా కనిపిస్తుంది. కొత్త కేసుల పెరుగుదలకు ఎక్స్ బిబి 1.16 లేదా ఆర్ట్యూరుస్ గా పిలిచే కొత్త వేరియంట్ కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సాధారణంగా కరోనా మహమ్మారి బారిన పడిన వారిలో జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, వాసన, రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే కొత్త వేరియంట్ ఎక్స్ బిబి 1.16 కారణంగా మరికొన్ని కొత్త లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఎక్స్ బీబీ 1.16 వేరియంట్ బారిన పడుతున్న వారిలో అధిక జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో పాటు కళ్ళు పుసులు కట్టడం, దురదగా ఉండటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నట్లుగా వైద్యులు గుర్తించారు.

ముఖ్యంగా ఈ వైరస్ చిన్నారులపై ప్రభావం ఎక్కువ చూపుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశంగా భావిస్తున్నారు. ఈ సంవత్సరం జనవరి నెలలో ఎక్స్ బి బి 1.16 వేరియెంట్ కు సంబంధించిన రెండు కేసులు నమోదు కాగా, తర్వాతి నెలల్లో ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఫిబ్రవరి, మార్చి నెలలలో వాటి సంఖ్య వందల్లోకి చేరినట్టు తెలుస్తుంది.
ఇప్పటివరకు వచ్చిన కరోనా వేరియంట్లతో పోలిస్తే ఈ వేరియంట్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రస్తుతం అది ప్రమాదకరంగా కనిపించనప్పటికీ, మళ్లీ అది రూపాంతరం చెంది బలపడే అవకాశం కూడా లేకపోలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అందుకే కరోనా మహమ్మారి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని పదేపదే ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నా ప్రజలలో మాత్రం కరోనా కేసుల భయం కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం మాత్రం పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఎప్పటికప్పుడు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ కరోనా కట్టడికి దిశనిర్దేశం చేస్తుంది. ఈ క్రమంలోనే శుక్రవారం నాడు కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో సమీక్ష నిర్వహించి కరోనా కట్టడికి రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు.












Click it and Unblock the Notifications