ఆదాయపు పన్ను కొత్త బిల్లులో ఏం ఉండబోతోంది ? 12 లక్షల రిలీఫ్ ఎందుకు ?
ఇవాళ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో చెప్పుకోదగిన ప్రధాన అంశం ఆదాయపు పన్నే. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వేతన జీవులు ఆశించిన దాని కంటే ఎక్కువగా ఆమె ఆదాయపు పన్ను ఊరటనిచ్చారు. 12 లక్షల వార్షికాదాయం ఉన్న వారికి ఇచ్చిన మినహాయింపు మాత్రం ఎవరూ ఊహించలేదు. ఈసారి ఐటీ మినహాయింపు 10 లక్షలకు పెరగబోతోందనే అంచనాలు ఉన్నా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆర్థికమంత్రి 12 లక్షలు చేసేశారు.
అయితే ఇలా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని 12 లక్షలకు పెంచడం వెనుక ఉన్న లాజిక్ ఏంటనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతోంది. ప్రస్తుతం దేశంలో ఆర్ధిక మందగమన పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ప్రజలు డబ్బులు ఖర్చుపెట్టేందుకు అస్సలు సిద్ధంగా లేరు. ఇలాంటి పరిస్ధితుల్లో వారితో ఏదో విధంగా ఖర్చుపెట్టించాలంటే పన్నుకు బదులు ఇతరత్రా మార్గాల్లో ఖర్చుపెట్టించాలి. అంటే వారి కొనుగోలు శక్తి పెంచాలి. అందుకే ఇలా 12 లక్షల కు ఐటీ పరిమితి పెంచినట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయ పరిణామాలకు తోడు దేశీయంగా నెలకొన్న పరిస్దితులు కూడా ఆర్ధిక వృద్ధిరేటు మందగింపుకు కారణంగా ఉన్నాయి. అయితే వీటిని మార్చే పరిస్ధితి ఇప్పట్లో కనిపించడం లేదు. అందుకే ప్రజల కొనుగోలుశక్తిని ముఖ్యంగా మధ్యతరగతి కొనుగోలు శక్తిని పెంచడం ఒక్కటే కేంద్రానికి ప్రధాన మార్గంగా కనిపించింది. అందుకే ఐటీ పరిమితి ఎన్నడూ లేనంతగా తొలిసారి 5 లక్షలు పెరిగింది. అదే సమయంలో ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు చేస్తూ వచ్చే వారం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడతానని ఆర్థికమంత్రి చేసిన ప్రకటనపైనా జనంలో చర్చ జరుగుతోంది.
ఇలా అనూహ్యంగా ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు చేసేందుకు కేంద్రం సిద్దం కావడం వెనుక కూడా ఇదే కారణం ఉంది. ఆర్ధిక మందగమనం నుంచి బయటపడాలంటే పన్ను చెల్లించే వారికి నిబంధనలు మరింత సులువు చేయడం ద్వారా వారితో ఎలాగైనా పన్ను కట్టించాలనే కారణం కనిపిస్తోంది. అందుకే పన్ను సంస్కరణల్లో భాగంగా ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు చేయబోతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం చట్టంలో ఉన్న సగం అంశాల్ని తొలగించబోతున్నట్లు నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన చూస్తే భారీ మార్పులు తప్పేలా లేవు. అయితే వీటి లక్ష్యం మాత్రం ఒక్కటే జనంతో ఏదో విధంగా పన్ను కట్టించడం.












Click it and Unblock the Notifications