హెచ్‌ఎస్‌బీసీ నల్ల ఖాతాల్లో బడా బాబులు: విచారణ జరిపిస్తామన్న జైట్లీ
న్యూఢిల్లీ: నల్లధనం కలిగిన ఖాతాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఇప్పటి వరకూ 350 మంది ఖాతాల మదుపు పూర్తి చేశామని, మిగతా ఖాతాల మదింపు మార్చిలోగా పూర్తి చేస్తామని అన్నారు.
సోమవారం జైట్లీ మీడియాతో మాట్లాడుతూ పన్ను ఎగవేత దారులపై జరిమానాకు సంబంధించిన విచారణ కూడా చేపట్టామన్నారు. చట్టపరంగా విదేశీ ఖాతాదారులపై చర్యలు తీసుకుంటామని జైట్లీ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు నియమించిన సిట్ ఆధ్వర్యంలో మార్చి 31లోగా మిగతా ఖాతాదారుల విచారణ పూర్తి చేస్తామన్నారు.
నల్లధనం కేసులో ఇప్పటికే 60 మందిపై దర్యాప్తు మొదలైందన్నారు. వీరి ఖాతాల్లో రూ.1,500 కోట్లకు పైగా సొమ్ము ఉన్నట్లు అధికారులు గుర్తించారని సమాచారం. విదేశీ ఖాతాల అంశమై స్విస్ అధికారులతో మాట్లాడేందుకు ఓ బృందాన్ని అక్టోబర్ లోనే పంపినట్లు జైట్లీ తెలిపారు.
విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం గత ఏడు నెలలుగా చర్యలు తీసుకుంటోందన్నారు. గత అక్టోబర్‌లో 627 మంది నల్ల కుబేరుల పేర్లతో కేంద్రం సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే.

ఇక జెనీవాలోని హెచ్‌ఎస్‌బీసీలో ఖాతాలున్నట్లు సోమవారం మరికొందరి పేర్లు వెలుగులోకి రావడంపై ఆయన స్పందించారు. కేవలం పేర్లు ఉంటే చాలదని, దర్యాప్తు చేయడానికి సరైన ఆధారాలతో పాటు వివరాలు కావాలని ఆయన పేర్కొన్నారు.
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తా కథనంలో సుమారు 1,925 మంది భారతీయులు జెనీవాలోని హెచ్‌ఎస్‌బీసీలో ఖాతాలున్నట్లు పేర్కొంది. స్విస్ లీక్స్ పేరుతో ఈ కథనాన్ని ప్రచురించింది. మొత్తం 200 దేశాల్లో ఉన్న ఖాతాల్లో 2006-07 సంవత్సరానికి గాను 100 బిలియన్ డాలర్లు ఉన్నట్లు పేర్కొంది.
ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ, ఆనంద్ చంద్ బర్మన్, రాజన్ నందా, యశోవర్దన్ బిర్లా, చంద్రు లచ్చమండ్స్ రహేజా, దత్తరాజ్ సల్కోగార్, శ్రావన్ గుప్తా లాంటి భారతీయ టాప్ బిజినెస్ పేర్లు లిస్ట్‌లో ఉన్నట్లు పేర్కొంది. వీరితో పాటు భారత్‌లో ప్రముఖ వజ్రాల వ్యాపారులైన రస్సెల్ మెహతా, అనూప్ మెహతా, చేతన్ మెహతా, గోవిందబాయ్ కకాడియా, కునాల్ షా ఉన్నట్లు పేర్కొంది.
దీంతో పాటు కొందరు రాజకీయ నాయకులు కూడా ఖాతాలను కలిగి ఉన్నారు. అయితే కోర్టులో విచారణ మొదలైన తరువాతనే ఖాతాదారులు పేర్లు వెల్లడించాలని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నట్లు 250 మంది అంగీకరించారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications