ఈ నెల 15 నుంచి పాఠశాలల్లో కొత్త నిబంధనలు..
ఆగ్టసు 15 నుంచి పాఠశాలల్లో కొత్త నిబంధనలు అమలు చేయాలంటూ హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్నేహితులు కనిపించగానే గుడ్‌మార్నింగ్ చెప్పుకోవడం అనేది చాలా కామన్. కానీ, ఇకనుంచి, గుడ్‌మార్నింగ్‌కు బదులుగా జైహింద్ చెప్పాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ఆదేశాలు కూడా జారీ చేసింది.
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ రోజు నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రావలంటూ అధికారులను ఆదేశించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజు జెండా ఎగురవేసే ముందు నుంచి జైహింద్ ను అమలు చేయాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే దేశభక్తి, దేశంపై గౌరవం పెంపొందించే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.

రాష్ట్రంలో మొత్తం 14, 300 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో 23లక్షల10 వేల మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతున్నారు. హర్యానా రాష్ట్రంలో సుమారు ఏడు వేల ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, అందులో ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే విద్యార్థులు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇక, ఈ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఈ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకురావాలని అధికారులు చెబుతున్నారు.
జైహింద్ అనే నినాదం స్వాత్రంత్ర్యోదమ సమయంలో భారతీయులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడిందని, నేతాజి సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేశారని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్వాతంత్య్ర పొరాట సమయంలో నాయకులంతా ఒకరినొకరు జైహింద్ అని సంబోధించుకునేవారని తెలిపారు. అనంతరం సాయుధ బలగాలు దానిని గౌరవంగా స్వీకరించాయని ఉత్తర్వుల్లో వివరించారు. జైహింద్ అనే నినాదం విద్యార్థుల్లో ఐక్యతను పెంపొందించే దిశగా ఉంటుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications