దేశంలో మొదలైన కొత్త టోల్ బాదుడు; వాహనదారుల జేబులకు చిల్లు!!
దేశవ్యాప్తంగా పెంచిన టోల్ బాదుడు షురూ అయింది. వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్ బాదుడు మొదలుపెట్టింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా తీసుకున్న నిర్ణయం లో భాగంగా నేటి నుండి జాతీయ రహదారులు మరియు ఎక్స్ ప్రెస్ హైవేలపై టోల్ చార్జీలను పెంపు చేసి వసూళ్లు మొదలు పెట్టింది.
దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజా ల వద్ద ఐదు శాతం నుండి పది శాతం వరకు టోల్ టాక్స్ ను పెంచాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం నేటి నుంచి అమల్లోకి వస్తుంది. ఇక ఈ నిర్ణయంతో వాహనదారుల జేబులకు చిల్లులు పడనున్నాయి. జాతీయ రహదారుల రుసుముకు సంబంధించిన రూల్స్ 2008 ప్రకారం సవరించిన టోల్ రేట్ల ప్రతిపాదన మార్చి 25వ తేదీ నాటికి కేంద్ర రోడ్డు మరియు రవాణా మంత్రిత్వ శాఖల ఆమోదానికి పంపబడింది. ఇది కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత నేటి నుండి అమలు అవుతుంది.

దీని ప్రకారం కార్లు మరియు తేలికపాటి వాహనాలపై ఒక్కో ట్రిప్పుకు ఐదు శాతం, భారీ వాహనాలకు టోల్ టాక్స్ అదనంగా 10 శాతం పెంపు చేసి వసూళ్లు మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం టోల్ టాక్స్ లను పెంచుతున్న పరిస్థితి వాణిజ్య అవసరాల కోసం వినియోగించే, భారీ వాహనదారులకు సైతం ఇబ్బంది కలిగిస్తుంది. ఈ సంవత్సరం 5 నుండి 10 శాతం వరకు టోల్ చార్జీలు పెంచడంతో నేషనల్ హైవే ల మీద ప్రయాణం చేసే వాహనదారులు తీవ్ర అసహనంతో ఉన్నారు.
ఇప్పటికే పెంచిన టోల్ పన్నులను తగ్గించాలని అనేక రాష్ట్రాలలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో ఆందోళనలు కూడా చేశారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్టానికి చేరుకొని, నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్న వేళ టోల్ బాదుడు కూడా మొదలు కావడం సామాన్యుల జీవితాలపై పెనుభారం పడేలా చేస్తుంది.












Click it and Unblock the Notifications