నేపాల్ సరిహద్దుల వరకూ వందే భారత్ ఎక్స్ ప్రెస్
దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల దూకుడు కొనసాగుతోంది. సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 150 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.
సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు, వేగం.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు.

ఈ క్రమంలో మరో కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. భారత్- నేపాల్ సరిహద్దు వరకు ఈ రైలు పరుగులు పెట్టబోతోంది. బీహార్ లోని దానాపూర్ నుంచి నేపాల్ సరిహద్దు పట్టణం జోగ్బాణీ వరకు ఈ రైలు రాకపోకలు సాగించనుంది. ఈ సెమీ హై-స్పీడ్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 15 లేదా 17న ప్రారంభించే అవకాశం ఉంది. పూర్ణియా విమానాశ్రయం ప్రారంభోత్సవంతో పాటుగా ఈ రైలుకు కూడా పచ్చజెండా ఊపనున్నారు.
సీమాంచల్ నుంచి నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు ఈ రైలు ద్వారా ప్రయాణం మరింత సులభతరం కానుంది. నేపాల్ సరిహద్దులకు మెరుగైన రైల్ కనెక్టివిటీని కల్పించడంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. చిట్ట చివరి స్టేషన్ అయిన జోగ్బాణీ నుంచి ప్రయాణికులు కాలి నడక లేదా ఇతర వాహనాల ద్వారా నేపాల్‌లోకి నేరుగా ప్రవేశంచవచ్చు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ మార్గాన్ని సుమారు ఎనిమిది గంటల్లో పూర్తి చేయగలదని అంచనా. పాటలీపుత్ర జంక్షన్, హాజీపూర్, ముజఫర్‌పూర్, సమస్తిపూర్, సహర్సా, మాధేపురా, అరారియా, పూర్ణియాల మీదుగా ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రాకపోకలు సాగించే అవకాశం ఉంది. జోగ్బాణీ నుండి తెల్లవారు జామున బయలుదేరి మధ్యాహ్నానికి దానాపూర్ చేరుకుంటుంది. మళ్లీ మధ్యాహ్నం దానాపూర్ నుంచి బయలుదేరి రాత్రికి జోగ్బాణీకి వస్తుందని భావిస్తున్నారు.
సీమాంచల్‌కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ సేవలు అందుబాటులోకి రావడం ఇదే మొదటిసారి. పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా 16 కోచ్‌లతో ఈ రైలును నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. రైలు కోచ్‌లు వచ్చే వారం దానాపూర్ డిపోకు చేరుకుంటాయని రైల్వే అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications