శోభనం రాత్రే నవదంపతులు మృతి: ఇద్దరికీ ఒకేసారి గుండెపోటు! ఇదే కారణమా?
లక్నో: మూడు ముళ్లబంధంతో ఒక్కటైన ఓ యువ జంటకు తొలి రాత్రే చివరి రోజైంది. శోభవనం రోజు రాత్రి నవదంపతులకు ఒకేసారి గుండెపోటు రావడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో అప్పటి వరకు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో కళకళలాడుతున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రెయిచ్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ప్రతాప్ యాదవ్(24), పుష్ప (22)కు మే నెల 30న వివాహం జరిగింది. బారాత్ జరిగిన తర్వాతి రోజు పెళ్లికొడుకు ఇంట్లో శోభనం ఏర్పాటు చేశారు. దీంతో ఆ కొత్త జంట రాత్రి వారి రూంలోకి వెళ్లింది. అయితే, మర్నాడు ఉదయం ఎంత సేపయినా బయటకు రాలేదు. బంధువులు తలుపులు బద్దలుకొట్టి చూడగా బెడ్‌పై ప్రతాప్, పుష్ప విగత జీవులుగా కనిపించారు. దీంతో ఒక్కసారిగా ఆ ఇంట్లో విషాదం అలుముకుంది.

మరోవైపు, బంధువులు ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించారు. భార్యభర్తలు ఇద్దరూ ఒకే సమయంలో గుండెపోటుతో చనిపోయినట్లు పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు వెల్లడించారు. అయితే, కొత్త జంటలో ఎవరికీ గుండె సంబంధింత వ్యాధులు ఉన్న చరిత్ర లేదని.. ఒక్కరోజే ఇద్దరికీ గుండెపోటు రావడం మిస్టరీగా ఉందని వైద్యులు వెల్లడించారు. వారి మృతిపై మరింత ఎంక్వయిరీ చేసేందుకు వారి శరీరంలో నుంచి నమూనాలు సేకరించి లక్నోలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీకి పంపామని తెలిపారు.
కొత్త జంట మృతికి ఇదే కారణమా?
నూతన వధూవరులు గడిపిన గదిలో వెంటిలేషన్ లేదు. దీంతో గాలి ఆడకే ప్రతాప్, పుష్ప కార్డియాక్ అరెస్టుకు గురై చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కొత్త జంట పెళ్లి వేడుకలో రెండు రోజులపాటు తీరిక లేకుండా గడిపారని.. దీంతో వారు తీవ్రంగా అలసిపోయి ఉంటారని చెప్పారు. అదే సమయంలో వారికి శోభనం ఏర్పాటు చేయడంతో ఇలా జరిగి ఉండొచ్చని అంటున్నారు.

ఆ రూంలోకి బయటి వ్యక్తులు వచ్చిన ఆనవాళ్లేమీ కనిపించలేదు. వారిపై దాడి జరిగినట్లు కూడా పోస్టుమార్టం రిపోర్టులో తేలలేదు. దీంతో వారి మరణం మిస్టరీగా మారింది. పెళ్లి వేడుకలో జరిగిన ప్రతి సంఘటనపైనా ఎంక్వయిరీ చేస్తున్నాం. వారు ఏం తిన్నారో కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఫోరెన్సిక్ నిపుణులు కూడా వారు గడిపిన గదిని పరిశీలించారు. మరింత లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications