• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

9 ఆస్పత్రులు తిరిగినా దొరకని బెడ్‌, అంబులెన్సులోనే చనిపోయిన నవ వధువు: ప్రెస్ రివ్యూ

By BBC News తెలుగు
|

ప్రతీకాత్మక చిత్రం

ఆస్పత్రిలో పడకలు దొరక్కపోవడంతో ఒడిషాలో కోవిడ్‌కు గురైన ఒక నవ వధువు అంబులెన్సులోనే చనిపోయిందని ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

కరోనా బారిన పడిన నవవధువు చికిత్సకు పడకలు లేవంటూ తొమ్మిది ఆసుపత్రులు నిరాకరించడంతో చివరకు ఆమె అంబులెన్సులోనే కన్నుమూశారు.

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. యువతి స్వర్ణలత (25)కు భువనేశ్వర్‌ సమీపంలోని బల్లిపట్నా ప్రాంతంలో ఉంటున్న విష్ణుతో ఇటీవల వివాహమైంది.

కొన్ని రోజుల కిందట స్వర్ణలతకు జ్వరం రావడంతో మాత్రలు వేసుకున్నారు. జ్వరం తగ్గకపోగా శనివారం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో బల్లిపట్నా పీహెచ్‌సీకి తీసుకెళ్లారు.

ఆక్సిజన్‌ స్థాయి తక్కువగా ఉందంటూ కటక్‌కు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. భువనేశ్వర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాలని కటక్‌ వైద్యులు సూచిస్తూ పంపించారు.

తీరా అక్కడికి వెళ్లాక కొవిడ్‌ రిపోర్టు లేకపోతే ఆసుపత్రిలో చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు. అటుపై ఎయిమ్స్‌ ఆసుపత్రి, ఆపై మరి కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఇలా 9 చోట్లకు తిరిగినా ఆమెను ఎవరూ చేర్చుకోలేదు.

దీంతో కుటుంబీకులు మళ్లీ బల్లిపట్నా పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. అక్కడి వైద్యులు వైద్యానికి ముందుకు రాకపోవడంతో మళ్లీ ఆమెను భువనేశ్వర్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ఆరోగ్యం విషమించి స్వర్ణలత అంబులెన్సులో చనిపోయారని ఈనాడు రాసింది.

కోవాగ్జిన్ రెండో డోసు కొరత

తెలంగాణలో కొవాగ్జిన్ రెండో డోసుకు బ్రేక్

డోసులు తగినన్ని నిల్వ లేకపోవడంతో తెలంగాణలో కొవాగ్జిన్ రెండో డోసు వేయడం నిలిపివేశారని ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

రాష్ట్రంలో కొవాగ్జిన్‌ రెండో డోసు పంపిణీని ప్రభుత్వం నిలిపివేసింది. నిల్వ తగినంత లేదని.. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొత్తగా స్టాక్‌ రానందున 45 ఏళ్లు పైబడినవారికి కొవాగ్జిన్‌ మలి డోసు పంపిణీని ఆపివేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది.

మళ్లీ ఎప్పుడు ప్రారంభించేదీ తర్వాత తెలియజేస్తామని పేర్కొంది. రాష్ట్రంలో శని, ఆదివారాలు వ్యాక్సినేషన్‌ సాగలేదు.

సోమవారం నుంచి పునఃప్రారంభం కావాల్సి ఉంది. మరోవైపు కొవాగ్జిన్‌ పంపిణీ నిలిచిపోవడంతో.. కొవిషీల్డ్‌ మొదటి డోసు తీసుకున్నవారికి రెండో డోసు పంపిణీ మాత్రమే కొనసాగనున్నట్లు స్పష్టమవుతోంది.

తెలంగాణ వద్ద ఇంకా 6.93 లక్షల డోసులున్నాయని కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. శనివారం నాటికి రాష్ట్రాలకు 20 కోట్లపైగా డోసులను కేటాయించినట్లు కేంద్రం తెలిపింది.

ఇందులో తెలంగాణకు 61.41 లక్షల డోసులు ఇచ్చినట్లు పేర్కొంది. కాగా, తెలంగాణ ప్రభుత్వం 54.47 లక్షల డోసులను (వృథాతో కలిపి) వినియోగించింది. ఇలా చూస్తే రాష్ట్రంలో 6.94 లక్షల డోసులు ఉన్నట్లు.

కొవాగ్జిన్‌ తగినంత స్టాక్‌ లేని కారణంగా పంపిణీ నిలిపివేశామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఉన్న స్టాక్‌ అంతా కొవిషీల్డ్‌గానే పరిగణించాల్సి వస్తోందని ఆంధ్రజ్యోతి వివరించింది.

భారత్‌లో తగ్గిన పాజిటివిటీ రేటు

భారత్‌లో తగ్గిన పాజిటివిటీ రేటు

గత కొన్ని రోజులుగా కోవిడ్ పాజిటివిటీ రేటు తగ్గుతోందని కేంద్రం ప్రకటించినట్లు సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

కరోనా గణాంకాలు ఊరటనిస్తున్నాయి. ఇంకా రోజుకు మూడు లక్షలకు పైనే కేసులు వస్తున్నప్పటికీ... మొత్తం మీద చూస్తే తగ్గుదల కనిపిస్తోంది.

శనివారం కొత్తగా 3,11,170 కేసులు వచ్చాయి. అయితే గడిచిన 25 రోజుల్లో ఇవే అత్యల్పం కావడం గమనార్హం.

అలాగే మే 3న ఏకంగా 24.47 శాతం ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 16.98 శాతానికి పడిపోయింది.

యాక్టివ్‌ కేసులు తగ్గడం కూడా ఉపశమనం కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 55,344 యాక్టివ్‌ కేసులు తగ్గాయని సాక్షి రాసింది.

3.62 లక్షల మంది కోలుకున్నారు. గడిచిన ఆరురోజుల్లో కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా నమోదవడం ఇది ఐదోసారి.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 14.66 శాతం ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపింది.

దేశంలో వరుసగా మూడో రోజూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే, మరణాలు మాత్రం నాలుగు వేలు దాటాయి.

గడిచిన 24 గంటల్లో 4,077 మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిందని సాక్షి వివరించింది.

భారత్‌లో నేటి నుంచి అందుబాటులోకి 2-డీజీ

డీఆర్డీవో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ తయారుచేసిన కోవిడ్ ఔషధం 2-డీజీ సోమవారం నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రానుందని నమస్తే తెలంగాణ పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

కరోనా చికిత్సకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీస్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్‌ (2-డీజీ) ఔషధం సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నది.

దిల్లీలోని దవాఖానలకు 10 వేల 2-డీజీ డోసుల ప్యాకెట్లను కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సోమవారం అందజేయనున్నారని పత్రిక చెప్పింది.

అత్యవసర వినియోగం కోసం డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఇటీవలే ఈ ఔషధానికి అనుమతినిచ్చింది.

2-డీజీ పౌడర్‌ రూపంలో ఉంటుంది. నీటిలో కలుపుకొని తాగాలి. కరోనా రోగుల చికిత్సకు ఇది సురక్షితమని, రోగులు దవాఖానల్లో చేరే అవకాశాల్ని తగ్గిస్తుందని, ఆక్సిజన్‌పై ఆధారపడుతూ చికిత్స తీసుకోవడాన్ని మెరుగుపరుస్తుందని పరిశోధకులు తెలిపారు.

ఈ ఔషధంలోని ఓ రకమైన సూడో గ్లూకోజ్‌ మాలిక్యూల్స్‌ వైరస్‌ తీవ్రతను తగ్గిస్తాయని వెల్లడించారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Newly married woman dies in ambulance after searching for a bed in 9 hospitals
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X