ఘోరం: నిద్రిస్తున్న నవవధువు గొంతుకోసి.. బంగారం దోచుకుని, నిప్పంటించారు
నవవధువు ఒంటిపై ఉన్న నగల కోసం దుండగులు ఆమెను దారుణంగా గొంతుకోసి హత్యచేశారు. ఉత్తరప్రదేశ్ లోని సిన్ హ్వాల్ కాపుర్వా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
లక్నో: వివాహం జరిగిన కొన్ని రోజులకే ఆ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నవవధువు ఒంటిపై ఉన్న నగల కోసం దుండగులు ఆమెను దారుణంగా గొంతుకోసి హత్యచేశారు. ఉత్తరప్రదేశ్ లోని సిన్ హ్వాల్ కాపుర్వా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సిన్ హ్వాల్ కాపుర్వా గ్రామానికి చెందిన ఆశాదేవి(20) కి రాకేశ్ పటేల్ అనే యువకుడితో గత నెల 24న వివాహం జరిగింది. ఈ నెల 7న మెట్టినింటి నుంచి ఆమె పుట్టింటికి వచ్చింది.

గురువారం రాత్రి ఆమె తన పుట్టింట్లోని వెనుక భాగంలో నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో పలువురు దుండగులు అక్కడికి ప్రవేశించారు. నిద్రిస్తోన్న ఆమె గొంతుకోసి, ఆమె ఒంటిపై ఉన్న రూ. 2 లక్షల విలువైన నగలను దోచుకున్నారు.
అనంతరం ఆమె మృతదేహంపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ కొత్త పెళ్లికూతురి కుటుంబ సభ్యులు ఇంటి బయట నిద్రిస్తుండడంతో తెల్లవారే వరకు ఈ దారుణం వారి దృష్టికి రాలేదు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications