దేశంలో భారీ పేలుళ్ల కుట్ర భగ్నం: 8 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
బెంగళూరు: భారతదేశంలో భారీ బాంబు పేలుళ్లకు ఇస్లామిక్ స్టేట్(ISIS) ఉగ్ర సంస్థ పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) భగ్నం చేసింది. నాలుగు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించిన ఎన్ఐఏ ఉగ్ర సంస్థకు చెందిన 8 మంది ఉగ్రవాదులను అరెస్టు చేసింది. అంతేగాక, భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలకు సంబంధించిన ముడి సరకు, ఉగ్ర కుట్రకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుంది.
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, మహారాష్ట్రలోని పుణె, ముంబై, జార్ఖండ్‌లోని జంశెడ్పూర్, బొకారో సహా ఢిల్లీలో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించింది. కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ పోలీసుల సహకారంతో ఎన్ఐఏ ఈ సోదాలు జరిపింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థకు చెందిన 8 మంది ఏజెంట్లను అరెస్టు చేసింది. వీరంతా ఉగ్ర కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారు.

దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర చేసి పేలుడు పదార్థాలను సిద్ధం చేస్తున్నారు. మినాజ్ నేతృత్వంలో వీరంతా పని చేస్తున్నారు. పేలుడు పదార్థాలకు ఉపయోగించే ముడి సరకులైన సల్ఫర్, పొటాషియం నైట్రేట్, బొగ్గు, గన్‌పౌడర్, చక్కెర, ఇథనాల్, పదునైన ఆయుధాలను నిందితుల వద్ద నుంచి ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నగదు, నేరారోపణ పత్రాలు, స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర డిజిటల్ పరికరాలను కూడా నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు ఐఈడీల తయారీకి ఈ సామగ్రిని ఉగ్ర ముఠా సభ్యులు ఉపయోగిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా వీరంతా ఉగ్ర సంస్థల నేతలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. అంతేగాక, కాలేజీ విద్యార్థులను ఈ ఉగ్ర దాడులకు ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు వేసినట్లు దర్యాప్తులో తేలడం గమనార్హం. ఈ క్రమంలో కేసులు నమోదు చేసిన అధికారులు.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications