పాకిస్తాన్ పై తిరుగులేని ఆధారాలు సేకరించిన కేంద్రం
ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన పహల్గాం ఉగ్రవాద దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ అత్యంత కీలక అడుగు వేసింది. ఈ దాడి వెనుక మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించిన, పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్న లష్కరే తోయిబా, దాని అనుబంధ విభాగం ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌పై ఎన్‌ఐఏ తాజాగా సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. జమ్మూలోని ప్రత్యేక కోర్టుకు దీన్ని సమర్పించింది.
దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా యుద్ధం ప్రకటించడం, సరిహద్దుల అవతల నుంచి కుట్రలు పన్నడం వంటి అత్యంత తీవ్రమైన ఆరోపణలను ఎన్‌ఐఏ ఈ ఛార్జ్‌షీట్‌లో స్పష్టంగా పొందుపరిచింది. ఈ నేపథ్యంలో హఫీజ్ సయీద్ పై బీఎన్ఎస్ తో పాటు యూఏపీఏ 1967లోని కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వ్యక్తిగత హోదాలోనే కాకుండా ఉగ్రవాద సంస్థ అధిపతిగా కూడా అతనిపై నేరారోపణలు మోపారు.

పహల్గాంలో ఉగ్రవాద బీభత్సానికి పాకిస్తాన్ భూభాగం నుంచి అసలు కుట్ర కోణాన్ని హఫీజ్ సయీద్ నడిపించినట్లు ఎన్ఐఏ అధికారులు ఈ ఛార్జిషీట్ లో కూలంకషంగా వివరించారు. సరిహద్దులకు అవతల సురక్షిత స్థావరంలో కూర్చుని భారత్ లో శాంతిభద్రతలకు ఏ విధంగా విఘాతం కలిగించాడో నిరూపించే బలమైన ఆధారాలను దర్యాప్తు బృందాలు సేకరించాయి. క్షేత్రస్థాయిలో జరిపిన లోతైన పరిశోధనలు, విశ్లేషణల ద్వారా సంపాదించిన శాస్త్రీయ, సాంకేతిక, డిజిటల్ సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచారు.
గతంలో దాఖలు చేసిన దాదాపు 1,597 పేజీల సుదీర్ఘమైన అసలు ఛార్జ్‌షీట్ కేసు దర్యాప్తునకు.. ఈ తాజా పరిణామాలు మరింత బలాన్ని చేకూర్చాయి. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడం, స్థానిక యువతకు ఉగ్ర శిక్షణ ఇవ్వడం, భారత్‌కు వ్యతిరేకంగా వారిని రెచ్చగొట్టడం వంటి అంశాలపై ఎన్‌ఐఏ మొదటి నుంచి కీలక ఆధారాల కోసం అన్వేషిస్తూ వచ్చింది. ఈ క్రమంలో తనకు లభించిన ఆధారాలన్నీ కూడా తాజా ఛార్జిషీట్ లో పొందుపరిచింది.
లష్కరే తోయిబా ముసుగులో పనిచేస్తున్న టీఆర్ఎఫ్ వంటి విచ్ఛిన్నకర శక్తులను సమూలంగా అణచివేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న దీర్ఘకాలిక వ్యూహంలో ఓ ముఖ్య ముందడుగు పడినట్టయింది. సరిహద్దుల అవతల ఉంటూ భారత్ భద్రతకు ముప్పుగా మారిన ఉగ్రవాద సంస్థల ప్రధాన సూత్రధారుల పాత్రను అంతర్జాతీయ వేదికలపై కూడా తిరుగులేని విధంగా నిరూపించడానికి ఈ నివేదికలు ఎంతగానో ఉపయోగపడతాయి.
పహల్గామ్ లో గత ఏడాది ఏప్రిల్ 22న పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఈ ఘాతుక దాడి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మతం ప్రాతిపదికన పర్యాటకులను గుర్తించి, వారిపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ విషాదకర ఘటనలో 25 మంది పర్యాటకులు, ఓ స్థానిక పౌరుడు సహా మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై గత ఏడాది డిసెంబర్ 15న మొదటి ఛార్జ్‌షీట్ దాఖలైంది. ఇప్పుడు దీనికి సప్లిమెంటరీ జత అయింది.












Click it and Unblock the Notifications