మహారాష్ట్రలో కరోనా కల్లోలం: ఆదివారం రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని ఆదేశించారు. గత కొద్ది రోజులుగా కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న క్రమంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మార్చి 28 నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితి, కట్టడి చర్యలపై డివిజన్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎస్పీలతోపాటు వైద్యాధికారులతో శుక్రవారం సీఎం ఉద్ధవ్ థాక్రే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్ విధించడం తనకు ఇష్టం లేదని చెప్పారు. అయితే, ప్రజలు ఖచ్చితంగా కరోనా నిబంధనలను పాటించాలని కోరారు.

కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ఆరోగ్య సంరక్షణ వసతులు తగ్గిపోతున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా రోగులకు అవసరమైన పడకలు, మందులను అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రాత్రిపూట కర్ఫ్యూకి సంబంధించిన ఉత్తర్వులను విపత్తు నిర్వహణ శాఖ త్వరలోనే విడుదల చేస్తుందని సీఎం కార్యాలయం పేర్కొంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మాల్స్ మూసివేయాలని ఆదేశించారు. ఈ కర్ఫ్యూ రాత్రిపూట రాకపోకలపై ప్రభావం ఉండబోదని, అయితే, ఎక్కువ సంఖ్యలో గుమిగూడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
కాగా, మహారాష్ట్రలో గత వారం రోజులుగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. గురువారం ఒక్కరోజే 35,952 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, 111 మరణాలు సంభవించాయి. ఒక్క ముంబైలోనే 5వేలకుపైగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య మహారాష్ట్రలో 3 లక్షలకు చేరువలో ఉండటం గమనార్హం.












Click it and Unblock the Notifications