నికితా తోమర్‌ను కాల్చి చంపిన నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష
న్యూఢిల్లీ: హర్యానాలో గత సంవత్సరం సంచలనం సృష్టించిన నికితా తోమర్ హత్య కేసులో శిక్ష పడింది. ఈ కేసులో దోషులైన తౌసీఫ్, రిహాన్‌లకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఫరీదాబాద్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. దీంతోపాటు యువతి కుటుంబానికి రూ. 20 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే.. ఫరీదాబాద్‌లోని బల్లభ్‌గడ్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల నికితా తోమర్ బీకాం చివరి సంవత్సరం విద్యార్థిని. గత అక్టోబర్ 26న ఆమె పరీక్ష రాసి తిరిగొస్తుండగా తౌసీఫ్, అతడి స్నేహితుడు రిహాన్‌తో కలిసి కారులో వచ్చి ఆమెను అడ్డగించాడు. ఆమెను బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.

నికిత ప్రతిఘటించడంతో తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి కారులో పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నికిత.. ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోల ఆధారంగానే పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
తౌసీఫ్ మూడేళ్లుగా ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడని నికిత కుటుంబసభ్యులు తెలిపారు. 2018లో పెళ్లి చేసుకోవాలంటూ ఆమెను కిడ్నాప్ చేయగా, పోలీసులు కాపాడారని చెప్పారు. ఈ క్రమంలోనే తనతో పెళ్లికి నిరాకరించిందనే కోపంతో పట్టపగలే నడిరోడ్డుపై నికితను నిందితుడు కాల్చి చంపాడని చెప్పారు.
నిందితులకు యావజ్జీవ శిక్ష సరిపోదని, వారికి ఉరిశిక్ష వేయాలని నికిత తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలంటూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వారు తెలిపారు.












Click it and Unblock the Notifications