కేరళను వణికిస్తున్న నిపా వైరస్: శబరిమల యాత్రికులకు మార్గదర్శకాలు ఇవ్వాలన్న కోర్టు
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. నిపా వైరస్ కారణంగా ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు నిపా వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. నిపా వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తాజాగా, హైకోర్టు ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేసింది.
నిపా వ్యాప్తి నేపథ్యంలో పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల యాత్రికులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వానికి కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శబరిమల యాత్ర కోసం వచ్చే భక్తులకు అవసరమైన మార్గదర్శకాలను జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంపై ఆరోగ్యశాఖ కార్యదర్శితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ట్రావెన్ కోర్ దేవస్య బోర్డును కోర్టు కోరింది.

కాగా, ప్రతీ మలయాళ నెలలో పూజల కోసం పాతానంతిట్ట జిల్లాలోని శబరిమల ఆలయం ఐదు రోజులపాటు తెరుచుకుంటుంది. ఈ నెల ఆదివారం నుంచి యాత్రికుల కోసం దేవాలయం తెరిచి ఉంటుంది. మరోవైపు, నిపా వైరస్ కేసులతో కేరళ ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. నిపా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కోజికోడ్ జిల్లాలో ఇప్పటికే ఆంక్షలు విధించినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
కోజికోట్ జిల్లాలో నిపా ప్రభావిత ప్రాంతాలు, పంచాయతీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. అంతేగాక, జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు వారంరోజులపాటు సెలవు ప్రకటించారు. కేరళలో బయటపడిన నిపా వైరస్.. బంగ్లాదేశ్ వేరియంట్ అని.. దీని వ్యాప్తి తక్కువే అయినప్పటికీ.. మరణాల రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ తెలిపారు. అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, ఇప్పటి వరకు నమోదైన కేసులన్నీ అటవీ ప్రాంతానికి 5 కిలో మీటర్ల దూరంలోనే ఉన్నాయి.
కేరళ నిపా:
297 మంది హై-రిస్క్ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నారు. కేరళలో శుక్రవారం మరో 130 మంది కాంటాక్ట్‌లను గుర్తించడంతో నిపా పాజిటివ్ కేసుల కాంటాక్ట్ లిస్ట్‌లో వ్యక్తుల సంఖ్య 1,080కి పెరిగింది. హై-రిస్క్ కాంటాక్ట్ లిస్ట్‌లో 297 మంది వ్యక్తులు ఉన్నారు, వీరిలో 122 మంది ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు.

కాగా, ప్రపంచాన్ని వణికించిన కరోనావైరస్ కంటే నిపా వైరస్ చాలా ప్రమాదకరమని ఇప్పటికే భారత వైద్య పరిశోధన మండలి(ICMR) స్పష్టం చేసింది. కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ వ్యాప్తి ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. నిపా వైరస్ కారణంగా కేరళలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. అయితే, నిపా వైరస్ సోకిన వారు మరణించే అవకాశాలు చాలా ఎక్కువని ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇది 40-70 శాతం మధ్య ఉంటుందని తెలిపింది.
అయితే, ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ 19 సోకినవారు మరణించే అవకాశం 2-3 శాతం మాత్రమే ఉండేదని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ భల్ తెలిపారు. కేరళలో ప్రస్తుతం ఒకే రోగి నుంచి ఈ వైరస్ వ్యాప్తి మొదలైందని చెప్పారు. స్థానికంగా నిపా వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే, కేరళలోనే ఈ వైరస్ తరచూ ఎందుకు వెలుగుచూస్తుందనేది తెలియడం లేదన్నారు.
2018లో వ్యాప్తి చెందినప్పుడు గబ్బిలాలతో సంబంధం ఉన్నట్లు కనుగొన్నామని.. అయితే, గబ్బిలాల నుంచి మనుషులకు ఇన్‌ఫెక్షన్ ఎలా సంక్రమిస్తుందో ఖచ్చితంగా తెలియదని రాజీవ్ భల్ తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వైరస్ వ్యాప్తి వర్షాకాలంలోనే జరుగుతోందని చెప్పారు.












Click it and Unblock the Notifications