Income Tax Old Regime: పాత పన్ను విధానం రద్దవుతుందా ? తేల్చేసిన నిర్మలమ్మ..!
ఈసారి కేంద్ర బడ్జెట్ లో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఆర్ధికమంంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. కొత్త పన్ను విధానంలో భాగంగా పన్ను మినహాయింపు పరిమితిని 7 లక్షల నుంచి 12 లక్షలకు పెంచేశారు. దీనిపై వేతన జీవులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయం తర్వాత పాత పన్ను విధానాన్ని ఎత్తేస్తారన్న ప్రచారం మొదలైంది. దీనిపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
ఇవాళ ఇండియాటుడే-బిజినెస్ టుడే నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆర్దికమంత్రి నిర్మలా సీతారామన్ పాత పన్ను విధానం కొనసాగింపుపై స్పందించారు. పాత పన్ను విధానం రద్దవుతుందని జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తోసిపుచ్చారు. దాదాపు 75 శాతానికి పైగా ఆదాయపు పన్ను రిటర్న్ లు దాఖలు చేసే వారు కొత్త పన్ను విధానంలోకి మారిపోయినా పాత పన్ను విధానాన్ని రద్దు చేసే అలోచన తమకు లేదన్నారు. దాన్ని అలాగే కొనసాగిస్తామని స్పష్టత ఇచ్చారు. పన్ను చెల్లింపుదారులంతా కొత్త విధానంలోకి మారాలని మీరు భావిస్తున్నారా అన్న ప్రశ్నకు సమాధానంగా ఆర్థికమంత్రి ఈ క్లారిటీ ఇచ్చారు.

అయితే ఐటీ ఫైలింగ్ సరళంగా ఉండాలనే ఉద్దేశంతోనే తాజా మార్పులు తీసుకొస్తున్నట్లు ఆర్థికమంత్రి వెల్లడించారు. త్వరలో ఆదాయపు పన్ను కొత్త బిల్లు తెస్తామని ఇప్పటికే బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేసిన ఆర్దిక మంత్రి.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. త్వరలో తెచ్చే బిల్లులో పాత ఆదాయపు పన్ను చట్టంలో పలు మార్పులు చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. త్వరలో తెచ్చే ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్లు ఆర్ధికమంత్రి తెలిపారు. ఢిల్లీ ఎన్నికల కోసమే ఆదాయపు పన్ను ఊరట కల్పించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తోసిపుచ్చారు.












Click it and Unblock the Notifications