మోదీ బొమ్మతో రేషన్ ఇవ్వాలంటూ ఏపీలో నిర్మలా సీతారామన్ ఆదేశం: ప్రెస్ రివ్యూ

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) ద్వారా అందజేస్తున్న ఉచిత బియ్యం పంపిణీకి మోదీ చిత్రపటంతో తప్పనిసరిగా ఉండి తీరాల్సిందేనని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేసినట్లు ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

కేంద్రం ఉచితంగా బియ్యం ఇస్తోందనే విషయం ప్రజలకు తెలియజేయాలన్నారు. ఆదివారం విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం రేషన్‌ డిపోను ఆమె పరిశీలించారు.

'జాతీయ ఆహార భద్రత మిషన్‌లో భాగంగా ప్రజా పంపిణీ దుకాణంలోనే లబ్ధిదారులకు రేషన్‌ అందజేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లకు తీసుకెళ్లి ఇస్తే మాకు అనవసరం. కేంద్రం వాటా రేషన్‌ దుకాణాల వద్దే ఇవ్వండి. ఇచ్చేటప్పుడు అన్ని దుకాణాల్లోనూ పీఎంజీకేఏవై బోర్డులు ప్రదర్శించండి' అని అధికారులను ఆదేశించారు.

'తాను వస్తున్నానని పీఎంజీకేఏవై బోర్డు పెట్టారా.. ఇంతకుముందు కూడా ఉందా' అని డీలర్‌ను ప్రశ్నించారు.

అనంతరం ఉచిత బియ్యం ఎవరు అందిస్తున్నారో తెలుసా అని లబ్ధిదారులను ఆరా తీశారు. వారి నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ను పిలిచి ఉచిత బియ్యం గురించి లబ్ధిదారులకు మా ముందే తెలియజేయాలన్నారు.

దీంతో ఎమ్మెల్యే.. పీఎంజీకేఏవై ద్వారా బియ్యం ఇస్తున్నారని చెబుతూనే 'మా అన్న పథకాలైతే చెప్పగలంగానీ ఇవేం చెప్పగలం' అని నవ్వడంతో.. ప్రధాని మోదీ దేశంలో అందరికీ అన్నలాంటివారేనని గుర్తుంచుకోండి అంటూ మంత్రి సీతారామన్‌ పేర్కొన్నారని ఈనాడు వివరించింది.

కోవిడ్ టీకా

రెండు వేరు వేరు డోసుల ఫలితాలు బాగున్నాయి

రెండు వేరు వేరు టీకాల డోసులు వేసుకుంటే ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని ఐసీఎంఆర్ చెప్పినట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌ నగర్‌ జిల్లాలో 18 మంది అనుకోకుండా ఒక డోసు కొవిషీల్డ్‌, మరో డోసు కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న ఘటన గుర్తుందా ?

అలాంటి వారిపై భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) ఈ ఏడాది మే నుంచి జూన్‌ వరకు నిర్వహించిన అధ్యయనంలో ఆశాజనక ఫలితాలు వచ్చాయి.

ఒక డోసు కొవిషీల్డ్‌, మరో డోసు కొవాగ్జిన్‌ తీసుకున్న వారందరిలో రోగ నిరోధక స్పందన, ప్రభావశీలత మెరుగ్గా ఉన్నట్లు వెల్లడైంది.

ఈ సమాచారాన్ని కొవాగ్జిన్‌ రెండు డోసులు తీసుకున్న 40 మంది, కొవిషీల్డ్‌ రెండు డోసులు తీసుకున్న 40 మంది వలంటీర్ల ఆరోగ్య నివేదికలతో పోల్చిచూడగా ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి.

ఫుల్‌ డోసులు తీసుకున్న ఈ 80 మంది వలంటీర్లతో పోలిస్తే.. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ చెరో డోసును తీసుకున్న 18 మందిలోనే ఆల్ఫా, బీటా, డెల్టా కరోనా వేరియంట్లకు వ్యతిరేకంగా బలమైన రోగ నిరోధక ప్రతిస్పందన వెలువడిందని ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

వైర్‌సను తిప్పికొట్టే ఐజీజీ యాంటీబాడీలు, న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీల మోతాదు కూడా వేర్వేరు టీకా డోసుల లబ్ధిదారుల్లోనే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

వ్యాక్సిన్‌ తీసుకున్నాక మొదటి వారంలో ఈ మూడు గ్రూపుల వలంటీర్లలోనూ ఒకే విధానమైన తేలికపాటి దుష్ప్రభావాలు తలెత్తాయన్నారు.

పెద్దఎత్తున ర్యాండమైజ్డ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ చేస్తే వేర్వేరు టీకా డోసుల వాడకం ప్రభావాలు, ఫలితాలపై మరింత స్పష్టత వస్తుందని శాస్త్రవేత్తలు సూచించారని ఆంధ్రజ్యోతి వివరించింది.

కరోనా సర్టిఫికెట్

ఇక వాట్సాప్‌లో కరోనా వ్యాక్సీన్ సర్టిఫికెట్

కరోనా టీకా డోసులు పూర్తిగా వేసుకున్న తర్వాత వాట్సాప్‌ ద్వారా కూడా టీకా సర్టిఫికెట్ పొందవచ్చని సాక్షి దినపత్రి కథనం ప్రచురించింది.

కరోనా టీకా తీసుకున్న తర్వాత వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ పొందడం ఇప్పుడు మరింత సులభతరంగా మారింది. వాట్సాప్‌ ద్వారా సెకండ్ల వ్యవధిలోనే ఈ ధ్రువపత్రం పొందవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించాలంటే వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా మారింది.

కరోనా టీకా తీసుకున్నట్లు ధ్రువపత్రం సమర్పించిన వారికే ప్రయాణ అనుమతి లభిస్తోంది. ప్రస్తుతం కోవిన్‌ పోర్టల్‌ ద్వారా ఈ సర్టిఫికెట్‌ పొందే సదుపాయం ఉంది.

అయితే, కొన్ని సందర్భాల్లో ఈ పోర్టల్‌ మొరాయిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.

అందుకే సులభమైన ప్రత్యామ్నాయంగా వాట్సాప్‌ నుంచి సర్టిఫికెట్‌ పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా కార్యాలయం ఆదివారం ట్వీట్‌ చేసింది.

టీకా ఒక్క డోసు తీసుకున్నా, రెండో డోసు తీసుకున్నా ఆ మేరకు సర్టిఫికెట్‌ పొందవచ్చు. వాట్సాప్‌ నుంచి వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకొనే సౌలభ్యాన్ని కల్పించడం పట్ల పార్టీలకు అతీతంగా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రక్రియ చాలా సులువుగా ఉందని, వేగంగా పని చేస్తోందని ప్రశంసిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, తిరువనంతపురం శశి థరూర్‌ ఎంపీ ట్వీట్‌ చేశారని సాక్షి రాసింది.

నేటి నుంచి తెలంగాణ ఉద్యోగులకు ఆప్షన్లు

తెలంగాణలో కొత్త జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగులను వివిధ జిల్లాలకు సర్దుబాటు చేసే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు నమస్తే తెలంగాణ వార్తా పత్రిక కథనం ప్రచురించింది.

రాష్ట్ర ఉద్యోగులు తాము కోరుకున్న జిల్లాకు వెళ్లేందుకు ఆప్షన్లు పెట్టుకోనున్నారు. వారంపాటు ఆప్షన్లు ఎంచుకొనేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

ఇందుకోసం ప్రత్యేక ప్రొఫార్మాను రూపొందించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఉద్యోగులు తమ వివరాలన్నీ నింపి ఆ పత్రాలను ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్లలో అందజేయాల్సి ఉంటుంది.

వాటి ఆధారంగా ఈ నెల 31లోగా ఉద్యోగుల బదిలీ ప్రక్రియ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

జిల్లాలవారీగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను కేటాయించే ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఉమ్మడి జిల్లా కేంద్రం కలెక్టర్లను నోడల్‌ అధికారులుగా నియమించింది.

వీరు ఉమ్మడి జిల్లా పరిధిలో మిగిలిన జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకొని ఉద్యోగులు, పోస్టుల కేటాయింపు పూర్తిచేస్తారని పత్రిక వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+