పదేళ్లల్లో ఎనిమిదోస్సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం: డిప్యూటీ సీఎంగా యండ్ లీడర్
పాట్నా: అనేక రాజకీయ పరిణామాలు, హైడ్రామల మధ్య బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. 10 సంవత్సరాల వ్యవధిలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది ఎనిమిదోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇన్నిసార్లు బాధ్యతలను స్వీకరించిన నాయకుడు మరొకరు లేరనే చెప్పుకోవచ్చు. కాగా- ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.
కొద్దిసేపటి కిందటే రాజధాని పాట్నాలోని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ ఫగు చౌహాన్.. వారిద్దరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతానికి వారిద్దరే మంత్రులుగా ప్రమాణం చేశారు. త్వరలో మిగిలిన మంత్రుల పేర్లను ఖరారు చేస్తారు. జనత దళ్ (యునైటెడ్)-రాష్ట్రీయ జనతాదళ్-కాంగ్రెస్-వామపక్షాలతో మొత్తంగా ఏడు ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఇదివరకు భారతీయ జనతా పార్టీతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని నెలకొల్పిన విషయం తెలిసిందే. బీజేపీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా కొనసాగారు. కొన్ని కారణాలతో ఆయన ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. తాను సారథ్యాన్ని వహిస్తోన్న ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నాలు సాగిస్తోందని, ప్రత్యామ్నాయంగా తన రాజకీయ ప్రత్యర్థులను ప్రోత్సహిస్తోందనే కారణంతో నితీష్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి.
ఏది ఏమైనప్పటికీ- నితీష్ కుమార్ బీజేపీకి అనూహ్యంగా షాక్ ఇచ్చారు. ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలను కూల్చుకుంటూ వెళ్లిన భారతీయ జనతా పార్టీకి తొలిసారిగా రివర్స్ షాక్ తగిలింది. బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జనత దళ్ (యునైటెడ్) అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాలను సరికొత్త మలుపు తిప్పగలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

Recommended Video

ఈ ఏడుపార్టీల మహాకూటమి ప్రభుత్వంలో శాఖల కేటాయింపులకు సంబంధించిన పూర్తిస్థాయి కసరత్తు ఇంకా జరగాల్సి ఉంది. కీలకమైన హోం, ఆర్థికం, రెవెన్యూ వంటి మంత్రిత్వ శాఖలను ఆర్జేడీకి కేటాయించే అవకాశం ఉంది. తేజస్వి యాదవ్ హోం మంత్రిత్వ శాఖను అప్పగిస్తారని చెబుతున్నారు. మిగిలిన శాఖలను కాంగ్రెస్ ఇతర పొత్తు పార్టీలకు కేటాయిస్తారు. మొత్తంగా 25 మందిని మంత్రులుగా తీసుకోవచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications