బీజేపీకి నితీష్ ఝలక్-ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ..!
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామి, బీహార్ లోనూ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న జేడీయూ అధినేత నితీష్ కుమార్ కు కోపం వచ్చింది. బీజేపీతో కలిసి గతంలోనూ పలుసార్లు పిల్లిమొగ్గలు వేసిన చరిత్ర ఉన్న నితీష్ కుమార్ మరోసారి ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వానికి తమ పార్టీ జేడీయూ మద్దతు ఉపసంహరించారు. ఈ మేరకు నితీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు.
నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) మణిపూర్‌లో ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వానికి ఇవాళ మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో ఆ పార్టీకి మణిపూర్ అసెంబ్లీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే ప్రతిపక్షంగా మారారు. జేడీయూ నిర్ణయం వల్ల ఇప్పటికిప్పుడు మణిపూర్ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా..కేంద్రంతో పాటు బీహార్ లోనూ బీజేపీతో కలిసి నడుస్తున్న నితీష్..ఇక్కడ తీసుకున్న నిర్ణయం ప్రభావం భవిష్యత్తులో ఉండొచ్చని భావిస్తున్నారు.

వాస్తవానికి మేఘాలయలో అధికారంలో ఉన్న కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ తాజాగా మణిపూర్ లోని బీరెన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. ఇది జరిగిన నెల రోజుల తర్వాత నితీష్ కుమార్ పార్టీ జేడీయూ కూడా మద్దతు వెనక్కి తీసుకుంది. మణిపూర్‌లో 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఆరు సీట్లు గెలుచుకుంది. ఇందులో ఐదుగురు ఇప్పటికే బీజేపీలోకి ఫిరాయించారు. అయినా ఇన్నాళ్లు మిగిలిన ఎమ్మెల్యే కూడా ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు.
60 మంది సభ్యుల మణిపూర్ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన ఐదుగురు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా మద్దతుగా ఉన్నారు.












Click it and Unblock the Notifications