కులం కోసం విరోధులంతా ఒక్కటిగా -కులాల వారీగా జనాభా లెక్కలకు మోదీపై ఒత్తిడి -నితీశ్ అనూహ్యం
దేశంలో కులాల వారీగా జనాభాను లెక్కించాలన్న డిమాండ్ రోజురోజుకూ బలపడుతున్నది. ఇటీవల పార్లమెంటులో ఓబీసీ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కుల గణనకు మరింత మద్దతు పెరిగింది. సాక్ష్యాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీనే ఓబీసీ అయినందున కుల గణన చేపట్టాలంటూ అన్ని పార్టీలూ ఆయనపై ఒత్తిడి పెంచాయి. ఈ క్రమంలోనే..

బీహార్‌లో కుల గణన
కుల గణన డిమాండ్ తో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అనూహ్య చర్యకు దిగారు. రాజకీయ విరోధులైన విపక్షాలనూ కలుపుకొని సదరు డిమాండ్ పై ఢిల్లీలో వాణిని వినిపించారు. బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ సహా మొత్తం 10 భిన్నమైన పార్టీల నేతలను వెంటేసుకుని సీఎం నితీశ్ సోమవారం నాడు ఢిల్లీలో వాలారు. 2021 జనాభా లెక్కల్లోనే కుల గణన చేపట్టాలనే డిమాండ్ తో వారంతా ప్రధాని మోదీని ఢిల్లీలో కలిశారు. నితీశ్ బృందంలో ముఖేశ్ సహాని, జితన్ రామ్ మాంజీలు కూడా ఉన్నారు. ప్రధానిని కలిసిన తర్వాత బీహార్ సీఎం నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కులాల వారిగా జనాభా లెక్కలు చేపట్టాలన్న డిమాండ్‌ను ప్రధాని ఆలకించినట్లు నితీశ్ తెలిపారు. ఈ అంశంపై సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన్ను కోరినట్లు చెప్పారు. కుల గణన అంశంపై రాష్ట్ర అసెంబ్లీ రెండు సార్లు తీర్మానాలు చేసినట్లు సీఎం నితీశ్ తెలిపారు. కాగా,

దేశ వ్యాప్తంగా కుల గణన..
సీఎం నితీశ్ తర్వాత ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు. కేవలం బీహార్ లో మాత్రమే కాదు.. యావత్ దేశంలోనూ కుల గణన చేపట్టాలని ప్రధాని మోదీని డిమాండ్ చేసినట్లు తేజస్వి వెల్లడించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని తేజస్వి చెప్పారు. గతంలో బీహార్ అసెంబ్లీలో కుల గణనపై రెండు సార్లు తీర్మానాలు చేసినట్లు ఆయన తెలిపారు. కుల గణాంకాల ఆధారంగా ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలను రూపొందించే వీలు ఉంటుందని తేజస్వి అన్నారు.

మండల్ వర్సెస్ మందిరం
దేశంలో కులం, వర్గం ఒకటేననే వాదన రామ్ మనోహర్ లోహియా కాలం నుంచి బలపడుతూ వచ్చింది. దేశ జనాభాలో 20 శాతం కూడా మించని అగ్ర వర్ణాల గుప్పిట్లోనే అత్యధిక సంపద, రాజకీయ అధికారం పోగు పడిందనీ, ఈ అసమానతలను తొలగించాలంటే ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్లు కల్పించడమే మార్గమేనన్న లోహియా అడుగుజాడల్లో పలు బీసీ పార్టీలూ పుట్టుకొచ్చాయి. జనతా ప్రభుత్వంలో లోహియా అనుచరుల ఒత్తిడి మేరకు, దేశంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలను గుర్తించడానికి అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ 1979లో మండల్ కమిషన్‌ను నియమించారు. అయితే, మండల్ ఉద్యమానికి వ్యతిరేకంగా మందిరం(అయోధ్య) ఉద్యమం తెరపైకొచ్చింది. మందిరం ఉద్యమంతో బాగా లాభపడ్డ బీజేపీ ఇవాళ అధికారంలో ఉంది.

యూపీ ఎన్నికలు-ఇరకాటంలో బీజేపీ
ప్రస్తుత మోదీ సర్కారు జాతీయ ఓబీసీ కమిషన్ ఏర్పాటు చేయడం, ఇటీవలే ఓబీసీ బిల్లును తీసుకువచ్చిన దరిమిలా అవి సమర్థవంతంగా అమలు కావాలంటే ముందు కుల గణన జరిగితీరాల్సిందేనని బీజేపీలోని బీసీ ఎంపీలు సైతం వాదిస్తున్నారు. కులాలవారీగా జనాభా లెక్కలు తీస్తే దేశంలోని వ్యవస్థలకు క్షేమకరం కాదనే భావన, రాజకీయంగానూ తీవ్ర ప్రభావం తప్పదనే భయంతో కులగణనపై ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. 2021 జనాభా లెక్కల్లో కుల గణన చేపట్టబోమని కేంద్రం ఇదివరకే స్పష్టం చేయడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలని పార్టీలు ఒత్తిడి చేస్తున్నాయి. వాటిలో ఎక్కువగా బీసీల ఆధ్వర్యంలో నడిచే పార్టీలే ఉండటం గమనార్హం. నేడు మరాఠాలు, పటేళ్లు, జాట్‌లు, కాపులు, గుజ్జర్లు తమను ఓబీసీలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్న దృష్ట్యా కులగణనకు ఎనలేని ప్రాముఖ్యం ఏర్పడింది. పార్లమెంటుకు అత్యధిక ఎంపీలను పంపే ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లలో ఓబీసీలు రాజకీయంగా బలోపేతం కావడం ఇతర రాష్ట్రాలలోని కులాలనూ ప్రభావితం చేస్తోంది. కుల గణన కోసం మహారాష్ట్ర, ఒడిశా ప్రభుత్వాలూ డిమాండ్ చేశాయి. 2022లో ఉత్తర్‌ప్రదేశ్ తోపాటు 7 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా కులగణన డిమాండ్ మళ్లీ ఊపందుకొంది.

జనాభా ఎంతో తేలకుంటే రిజర్వేషన్లెలా?
కులాల వారీగా జనాభా ఎంతో తేలకపోతే, ఓబీసీ బిల్లు కావొచ్చు, బీసీల ఉద్ధరణకు తెచ్చే ఏ చట్టాలైనా అమలులో ఇబ్బందులు తప్పవని, 2021 జనాభా లెక్కల్లో కచ్చితంగా కుల గణన చేపట్టాల్సిందేనని బీసీల నేతృత్వంలోని ప్రధాన పార్టీలు డిమాండ్ చేశాయి. తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ సైతం దీనికి మద్దతిస్తున్నది. దేశ జనాభాలో కులపరంగా, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబడిన కులాలు (ఓబీసీ) 52 శాతం ఉంటారనీ, వారికి కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్ రంగ సంస్థల ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిషన్ సిఫార్సు చేసింది. 1931లో చివరిసారిగా జరిగిన కుల గణన వివరాలను ఓబీసీల గుర్తింపునకు ప్రాతిపదికగా తీసుకుంది. అప్పటి నుంచి దేశంలో వివిధ కులాల శాతాలను కచ్చితంగా లెక్కగట్టాలనే డిమాండ్ బలంపుంజుకొంది. అయినా 2001, 2011 జనగణనలలో కులగణనకు కేంద్రం అనుమతించలేదు. 2012లో పేదరికం సర్వే కోసం కులాలవారీ లెక్కలను సేకరించినా, వాటిని బహిర్గతం చేయలేదు. ఏదిఏమైనా ఓబీసీల జనాభాపై ఇంతవరకు స్పష్టత లేదు. దేశ జనాభాలో ఓబీసీలు 52 శాతమని మండల్ కమిషన్ పేర్కొనగా, పాఠశాలల్లో విద్యార్థుల నమోదు వివరాలను బట్టి అది 45 శాతంగా లెక్కతేలుతుంది. 2007లో జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్.ఎస్.ఎస్.ఓ) చేసిన అధ్యయనం ఓబీసీల జనాభాను 41 శాతంగా తేల్చింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications