బుజ్జగింపుల్లేవ్- అభివృద్ధిపైనే ఫోకస్- తేల్చిచెప్పేసిన యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్...
యూపీలో వరుసగా రెండోసారి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన యోగీ ఆదిత్యనాథ్ ఇప్పుడు ఎక్కడ చూసినా అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. యూపీ అంటే గతంలో గుర్తుకొచ్చిన నేరాలు, నేరస్తులు, గ్యాంగ్ స్టర్లపై ఉక్కుపాదం మోపుతూనే.. మరోవైపు అభివృద్ధి ప్రాజెక్టుల్ని శరవేగంగా చేపట్టి పూర్తి చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో బుజ్జగింపు రాజకీయాలకు సైతం కాలం చెల్లిందని తాజాగా యోగీ తేల్చిచెప్పేశారు.
యూపీలో ఓటర్లను బుజ్జగించే రాజకీయాల కంటే అభివృద్ధితోనే బీజేపీ ప్రభుత్వం ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు యోగీ ఆదిత్యనాథ్ ప్రకటించారు. మొరాదాబాద్ లో స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగీ.. తన ప్రభుత్వ ప్రాధాన్యతల్ని మరోసారి ఓటర్లకు గుర్తుచేశారు. రాష్ట్రంలో మాఫియా రాజ్ కు కాలం చెల్లిందని, గతంలో మన మధ్య తిరిగిన గూండాలు ఇప్పుడు క్షమాభిక్ష కోసం పాకులాడుతున్నారని గుర్తుచేశారు.

మే 4, 11 తేదీల్లో యూపీలో జరగబోతున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో మరోసారి తన అజెండాను వెల్లడించిన యోగీ.. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ మంత్రంతోనే ముందుకెళ్లబోతోందని ఓటర్లకు తెలిపారు. వెండి వస్తువుల్ని తయారు చేసుకునే ముస్లింలు ఎక్కువగా ఉండే మొరాదాబాద్ లో ప్రచారంలో పాల్గొన్న యోగీ ఆదిత్యనాథ్ గతంలో ముస్లింలను బుజ్జగించిన ప్రభుత్వాల తీరును గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ముస్లింలను ఓట్ల కోసం ప్రత్యేకంగా బుజ్జగించేది లేదని స్పష్టం చేసారు.
మరోవైపు స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపడిన అంశాన్ని యోగీ ఆదిత్యనాథ్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. గతంలో గూండాల పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించినట్లు గుర్తుచేస్తున్నారు. గత ప్రభుత్వాల పాలనతో తన పాలన చూసి ఓట్లేయాలని కూడా కోరుతున్నారు. తాజాగా గ్యాంగ్ స్టర్ల వరుస హత్యల నేపథ్యంలో విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం వాటిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications