ఇకపై చైను లాగినా రైలు ఆగదు: ఫోన్ కొడితేనే..
లక్నో: ఇకపై చైను లాగితో రైలు ఆగకపోవచ్చు. ఎందుకంటే రైల్వే మంత్రిత్వ శాఖ త్వరలోనే చైను విధానాన్ని తొలగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇష్టానుసారం ఎవరుపడితే వారు చైను లాగి రైళ్లను ఆపడం వల్ల రైల్వేకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లుతోందనే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
అత్యవసర పరిస్థితిల్లోనే ఉపయోగించాల్సిన గొలుసును.. చీటికి మాటికి ఎవరో ఒకరు లాగడం వల్ల రైళ్లు చాలా ఆలస్యమవుతున్నాయని ఓ అధికారి తెలిపారు. ఆలస్యం వల్ల రైల్వేకు రూ. 3వేల కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. అందుకే గొలుసు విధానాన్ని తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఉత్తరప్రదేశ్ బరేలీలోని ఇజ్జత్‌నగర్‌లో రైళ్లలో చైన్లు తొలగించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని అధికారులు చెప్పారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో రైలు ఆపాలంటే ప్రత్యామ్నాయ మార్గంగా ఫోన్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.

ఇందు కోసం రైలు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ల ఫోన్ నెంబర్లను ప్రతీ కోచ్‌లో డిస్ ప్లే అయ్యేట్లు ఏర్పాట్లు చేయనున్నారు. ప్యాసింజర్లు అత్యవసర పరిస్థితిలో వారికి ఫోన్ చేసి రైలు ఆపించవచ్చు.
ఇక మీదట తయారు చేసే కొత్త కోచ్‌లలో అలారం చైన్లు ఉండవని ఇజ్జత్‌నగర్ రైల్వే అధికారి రాజేంద్ర సింగ్ తెలిపారు. ఈ మేరకు రైల్వే శాఖ నుంచి ఇప్పటికే ఆదేశాలు అందినట్లు చెప్పారు. ప్రతీ రైలులో మూడు కోచ్‌లకు వాకీటాకీతో ఓ సిబ్బంది పని చేస్తాడని తెలిపారు.


Click it and Unblock the Notifications