ఇంత గుడ్డిగా వ్యవహరిస్తే ఎలా ? విపక్షాలకు కిరణ్ రిజిజు చురకలు-రాహుల్ ప్రసంగం రేపే..
మణిపూర్ అంశంపై కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ వాడీవేడిగా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ గౌరవ్ గగోయ్ ప్రారంభించిన చర్చ కొనసాగుతోంది. ఇందులో ముందుగా గౌరవ్ గగోయ్ ప్రసంగంలో ప్రధాని మోడీని టార్గెట్ చేయగా.. దీనికి కౌంటర్ గా బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే విపక్షాలను, కాంగ్రెస్ ను కలిపి విమర్శించారు. అనంతరం మాట్లాడిన విపక్ష ఎంపీలు డింపుల్ యాదవ్, సుప్రియా సూలే కేంద్రం వైఖరిపై మండిపడ్డారు.
అనంతరం విపక్షాల అవిశ్వాస తీర్మానంపై మాట్లాడిన ఈశాన్య రాష్ట్రాల కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్ సహా విపక్షాలపై నిప్పులు చెరిగారు. ఇండియా కూటమి అని పేరు పెట్టుకుని జాతి వ్యతిరేక శక్తులకు మద్దతివ్వొద్దని వారిని కోరారు. అలా అయితే ఇండియా పేరు మీకు వర్కవుట్ కాదని తేల్చిచెప్పేశారు. అలాగే కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రాకముందు ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్దితులు ఎలా ఉండేవో ఆయన వివరించారు.

2014కి ముందు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన చాలా మంది ప్రజలు ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో జాతి వివక్ష, దౌర్జన్యాలను ఎదుర్కొన్నారని కిరణ్ రిజిజు తెలిపారు. 2014 తర్వాత పరిస్థితి మారిపోయిందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా గౌహతిలో డీజీపీ సదస్సు జరిగిందని గుర్తుచేశారు. ఈ సమావేశంలో ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు పోలీసులు తప్పనిసరిగా భద్రత కల్పించాలని ప్రధాని ఆదేశించారన్నారు. భారత ప్రజల సంక్షేమం కోసం కేంద్రం, బీజేపీ చేస్తున్న పనులను చూడలేని విపక్షాలు గుడ్డిగా ఉండకూడదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హితవు పలికారు.

మరోవైపు ఇవాళ అవిశ్వాసంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా కూడా సభను విడిచి వెళ్లిపోయారు. దీంతో ఇవాళ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగం ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. రాహుల్ గాంధీ లోక్ సభలో చేసే ప్రసంగంపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. ప్రధాని, హోంమంత్రి సభను వదిలి వెళ్లిపోవడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.












Click it and Unblock the Notifications