షాకింగ్: ఆక్సిజన్ లేక ఎవరూ చావలే -కరోనా మరణాలపై దొంగ లెక్కలు రాష్ట్రాలవే: మోదీ సర్కార్ ప్రకటన
కరోనా విలయం దెబ్బకు దేశ ప్రజలంతా బెంబేలెత్తిపోగా, ప్రభుత్వాలు మాత్రం తమాషా చూశాయనడానికి నిదర్శనంగా పార్లమెంట్ సాక్షిగా ఇవాళ కీలక ప్రకటన వెలువడింది. కొవిడ్ రెండో దశ విలయంలో లక్షల మంది రోగులు ఆక్సిజన్ లేక విలవిల్లాడటం, పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా వేల మంది చనిపోవడాన్ని జనం ప్రత్యక్షంగా చూసినా.. ప్రభుత్వాలకు మాత్రం ఆక్సిజన్ మరణాలు కనిపించలేదట.
కొవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత వల్ల రోగులు మరణించినట్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి నిర్దిష్టమైన సమాచారం లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు తెలిపింది. తొలి వేవ్ కంటే రెండో వేవ్ లో మెడికల్ ఆక్సిజన్ కు డిమాండ్ పెరిగిందని మాత్రం మోదీ సర్కారు అంగీకరించింది. తొలి వేవ్ సమయంలో 3,095 మెట్రిక్ టన్నులుగా ఉన్న మెడికల్ ఆక్సిజన్ డిమాండ్.. రెండో వేవ్ సమయంలో 9,000 మెట్రిక్ టన్నులకు పెరిగిందని, స్వయంగా తానే రంగంలోకి దిగి, రాష్ట్రాలన్నిటికీ సమానంగా మెడికల్ ఆక్సిజన్ పంపిణీ చేశామని కేంద్రం చెప్పుకుంది. ఈ మేరకు..

పార్లమెంట్ సమావేశాల రెండో రోజైన మంగళవారం కూడా కరోనా పరిస్థితుల నిర్వహణలో మోదీ సర్కారు వైఫల్యంపై విపక్షాలు ఆందోళన చేశాయి. కొవిడ్ సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత వల్ల సంభవించిన మరణాలు, మొత్తం మరణాల సంఖ్య దాచివేత ఆరోపణలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాడవీయ, అదే శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ సమాధానాలిచ్చారు..

వైద్యం, ఆరోగ్యం అనేవి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని అంశాలన్న కేంద్రం.. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రతి నిత్యం కేసుల సంఖ్యను, మరణాల సంఖ్యను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాయని, మరణాలను నివేదించవలసిన విధానంపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సవివరమైన మార్గదర్శకాలను జారీ చేశామని, అయితే ఆక్సిజన్ కొరత వల్ల సంభవించిన మరణాలంటూ నిర్దిష్టంగా తెలియజేయలేదని కేంద్ర మంత్రులు పార్లమెంటుకు తెలిపారు. మంగళవారం నాటికి దేశంలో కరోనా మరణాల సంఖ్య 4లక్షల 18వేల 479కి పెరింది.












Click it and Unblock the Notifications