మంటగలిసిన మానవత్వం- సగం కాలిన కరోనా శవాల్ని పీక్కుతిన్న కుక్కలు
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోలం కొనసాగుతున్న మానవత్వం మంటగలుస్తున్న ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా కోవిడ్ మృతదేహాలకు గౌరవ ప్రదంగా అంత్యక్రియలు నిర్వహించడమే కష్టంగా మారుతున్న నేపథ్యంలో ఒడిశాలో అలా అంత్యక్రియలు నిర్వహించిన మృతదేహాల్ని సైతం వీధి కుక్కలు పీక్కుతిన్న దారుణ ఘటన చోటుచేసుకుంది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో జిల్లా అధికార యంత్రాగం విచారణకు ఆదేశించింది.

ఒడిశాలో దారుణ ఘటన
దేశంలో వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటైన ఒడిశాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కరోనా సమయంలో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడమే గగనమైపోతున్న వేళ అంత్యక్రియల తర్వాత జరిగిన ఓ ఘటన మానవత్వానికే మాయనిమచ్చగా నిలిచేలా ఉంది. ముఖ్యంగా కోవిడ్ మృతదేహాల అంత్యక్రియలపై ప్రశ్నలు లేవనెత్తేలా ఉన్న ఈ ఘటన స్ధానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ అధికార యంత్రాంగంలోనూ కాకరేపింది.

సగం కాలిన శవాల్ని పీక్కుతిన్న వీధి కుక్కలు
ఒడిశాలో బాలాంగిర్ జిల్లా పరిధిలోని ఓ స్మశాన వాటికలో సగం కాలిన మృతదేహాల్ని వీధి కుక్కలు పీక్కుతిన్న ఘటన చోటు చేసుకుంది. అంత్యక్రియలు పూర్తయ్యాక బంధువులు వెళ్లిపోయాక మృతదేహాలు పూర్తిగా కాలకపోవడంతో వీధికుక్కలు వాటిని పీక్కుతినడం తీవ్ర కలకలం రేపింది. రాష్ట్రంలోని బిజఖమాన్ స్మశాన వాటికలో జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. కోవిడ్ మృతదేహాలు సగం కాలడం, వాటిని కుక్కలు పీక్కుతినడం వెనుక స్ధానిక అధికారుల నిర్లక్ష్యంపై ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తాయి.

ఘటనపై విమర్శల వెల్లువ
వాస్తవానికి ఒడిశాలో కోవిడ్ మృతదేహాల అంత్యక్రియల కోసం ప్రభుత్వం రూ.7500 చెల్లిస్తోంది. మృతదేహాల్ని మాత్రం బంధువులకు అప్పగించకుండా అధికారులే అంత్యక్రియలు చేస్తున్నారు. అయితే కోవిడ్ మృతదేహాలు ఎక్కువగా వస్తుండటం కట్టెలు కూడా అందుబాటులో లేకుండా పోవడంతో అరకొర కట్టెలతోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. దీంతో ఇలా సగం కట్టెలు, ఇంధనంతో నిర్వహించిన అంత్యక్రియలు పూర్తిగా జరగకపోవడంతో వీధి కుక్కలు శవాల్ని పీక్కుతిన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో స్ధానిక అధికారులు విచారణకు ఆదేశించారు.












Click it and Unblock the Notifications