Arvind Kejriwal: కేజ్రివాల్ కు ఢిల్లీ హైకోర్టులో దక్కని ఊరట-రేపు సుప్రీంలో సవాల్..!
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన అరెస్టును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీఎం అరవింద్ కేజ్రివాల్ కు ఊరట దక్కలేదు. తన అరెస్టును రద్దు చేయాలని కోరుతూ కేజ్రివాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ఇవాళ ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన తీహార్ జైల్లోనే కొనసాగాల్సిన పరిస్ధితి నెలకొంది. మరోవైపు ఢిల్లీ హైకోర్టు తీర్పును తప్పుబట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ.. రేపు ఆయన సుప్రీంకోర్టులోనే దీనిపై తేల్చుకుంటారని ప్రకటించింది.
ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో కేజ్రివాల్ పాత్ర ఉందనేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ చెప్తున్న నేపథ్యంలో ఆయన అరెస్టును రద్దు చేసేందుకు హైకోర్టు అంగీకరించలేదు. దీంతో కేజ్రివాల్ పిటిషన్ ను తోసిపుచ్చుతున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈడీ మద్యం కుంభకోణంలో కింగ్ పిన్ గా చెప్తున్న కేజ్రివాల్ ఏప్రిల్ 15 వరకూ తీహార్ జైల్లోనే ఉండాల్సి ఉంటుంది.

కేజ్రివాల్ ను అరెస్టు చేశాక కస్టడీలోకి తీసుకుని విచారించిన ఈడీ.. ఆ తర్వాత మాత్రం దాని కొనసాగింపు కోరలేదు. అలాగని ఆయన విడుదలకూ అంగీకరించడం లేదు. విచారణకు కేజ్రివాల్ అంగీకరించడం లేదని మాత్రమే చెబుతోంది. దీంతో కోర్టు కూడా కేజ్రివాల్ విడుదలపై నిర్ణయం తీసుకోలేని పరిస్దితి. ఈ నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కేజ్రివాల్ సిద్దమవుతున్నారు. ఢిల్లీ హైకోర్టు తీర్పును ఆయన సుప్రీంలో సవాల్ చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications