NO UPI Day: ఆ రోజు దేశవ్యాప్తంగా యూపీఐ చెల్లింపులు బంద్ ..! వ్యాపారుల నిర్ణయం..!
దేశవ్యాప్తంగా ఒక్క రోజు యూపీఐ చెల్లింపులు బంద్ కాబోతున్నాయి. 2 వేలు దాటిన యూపీఐ లావాదేవీలపై కేంద్రం తీసుకొచ్చిన ఎండీఆర్ ఛార్జీలు అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వ్యాపారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఒక్క రోజు నో యూపీఐ డేగా (NO UPI Day) పాటించాలని నిర్ణయించారు. ఆ రోజు ఎలాంటి యూపీఐ చెల్లింపులు స్వీకరించరు. వారూ చేయరు. ఈ నేపథ్యంలో కస్టమర్లు కూడా అలర్ట్ కావాల్సిన పరిస్ధితి ఎదురు కానుంది.
అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రాబోతున్న 2 వేలకు మించిన యూపీఐ లావాదేవీలపై ప్రతిపాదించిన 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)కు నిరసనగా.. అక్టోబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా 'నో యూపీఐ డే' (No UPI Day)గా పాటించాలని మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ & అగ్రికల్చర్ పిలుపునిచ్చాయి. ఈ నిరసనలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు, వ్యాపార సంఘాలు అంగీకరించాయని MACCIA అధ్యక్షుడు రవీంద్ర మంగవే తెలిపారు. గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2న నిరసనలో భాగంగా వ్యాపారులు యూపీఐ స్కానర్లు, క్యూఆర్ కోడ్లు, సౌండ్ బాక్స్‌లు, ఇతర పరికరాలను నల్లని వస్త్రంతో కప్పి ఉంచాలని నిర్ణయించారు.

ఎండీఆర్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలన్న డీలర్ల డిమాండ్‌పై చర్చించడానికి పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు తాజాగా ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్‌తో సమావేశమయ్యారు. అలాగే
భారీ యూపీఐ నిధుల బదిలీలపై విధించే ఎండీఆర్ విషయంలో స్టాక్ బ్రోకర్లు లేవనెత్తిన ఆందోళనలను నియంత్రణ సంస్థ పరిశీలిస్తుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఛైర్పర్సన్ తుహిన్ కాంత పాండే వెల్లడించారు. యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించడం వారి వ్యాపారానికి మరో భారాన్ని మాత్రమే పెంచుతుందని, డిజిటల్ చెల్లింపులు ఇబ్బందులను తగ్గించాలి కానీ వ్యాపారిని శిక్షించకూడదని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి.

ఎండీఆర్ ఛార్జీల్ని దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆల్ ఇండియా ఎడిబుల్ ఆయిల్ ట్రేడర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు శంకర్ థక్కర్ తెలిపారు. యూపీఐ స్కానర్లు, క్యూఆర్ కోడ్లు, సౌండ్ బాక్సులు, ఇతర సంబంధిత పరికరాలను నల్లటి వస్త్రంతో కప్పి, అక్టోబర్ 2న నిరసన చేపట్టాలని వ్యాపార సంఘాలు నిర్ణయించాయని ఆయన చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో తదుపరి ఆందోళన కోసం వ్యూహం ఖరారు చేసి, నిరసనను మరింత తీవ్రతరం చేస్తామన్నారు.














Click it and Unblock the Notifications
