రోడ్ సేఫ్టీ బిల్లు: బంద్‌తో స్తంభించిన జనజీవనం, తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం లేదు
న్యూఢిల్లీ: రోడ్ సేఫ్టీ బిల్లును వ్యతిరేకిస్తూ ట్రాన్స్‌పోర్ట్ రంగ కార్మికులు గురువారం చేపట్టిన బంద్ కారణంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్ సేఫ్టీ బిల్లును వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీ, గుజరాత్, బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కర్ణాటకలో బంద్ ప్రభావం పాక్షికంగా కనిపించింది.
పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో బంద్ కారణంగా రవాణా కార్మికులు, పోలీసులకు మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. పశ్చిమబెంగాల్‌లో కార్మికులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. కాగా, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బంద్ ప్రభావం అంతగా కనిపించేలేదు. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు తిరిగాయి. బిల్లును వ్యతిరేకిస్తూ పలు ఆటో సంఘాలు నగరంలో ర్యాలీ నిర్వహించాయి.
ఇది ఇలా ఉండగా ఈ బంద్‌లో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్(ఏఐఆర్‌టిడబ్ల్యూ) ఫెడరేషన్ పిలుపునిచ్చింది. కాగా, ఈ బంద్‌లో సిఐటియుసి, ఏఐటియుసి, ఐఎన్టీయుసి, బిఎంఎస్, హెచ్ఎంఎస్, ఏఐసిసిటియు, ఇండింపెండెంట్ స్టేట్ యూనియన్స్, ఎల్ పిఎఫ్(తమిళనాడు), యుపి రోడ్ వేస్ కర్మచారి సంయుక్త్ పరిషద్, గుజరాత్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్, ఎన్ఎల్ఓ, ఉత్తరాఖండ్ రోడ్ వేస్ కర్మచారి సంయుక్త పరిషద్, తెలుగు రాష్ట్రాలకు చెందిన యూనియన్లు పాల్గొన్నాయి.

రోడ్ సేఫ్టీ బిల్లు ధనిక, అభివృద్ధి చెందిన దేశాల్లోనైతే పని చేస్తోందని కార్మిక సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. ఎందుకంటే అక్కడ రోడ్లు చాలా బాగుంటాయని, మన దేశంలోలా ఉండవని వివరించారు. ముందు ఇక్కడ ఉన్న రోడ్ల వ్యవస్థను బాగు చేయకుండా రోడ్ సేఫ్టీ బిల్లును తేవడం సరికాదన్నారు.
రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ సేఫ్టీ బిల్లు 2014
ఈ బిల్లు అమలులోకి వస్తే రవాణా నిబంధనలన్నీ కేంద్రం చేతిలోకి వెళ్లనున్నాయి. దీంతో డ్రైవింగ్‌లో తప్పులు జరిగితే జరిమానాలు భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పుడు సిగ్నల్ జంప్‌కు మామూలుగా రూ. వందల నుంచి వేలలో జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఓవర్ స్పీడ్‌కు రూ. వెయ్యి నుంచి రూ.3 వేలకు జరిమానా పెరిగే అవకాశం ఉంది. ఇలా జరిమానా పాయింట్లు 12కు చేరితే డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తారు. దీనిపై కార్మిక సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
తమ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రోడ్లు సరిగా లేక ప్రమాదాలు జరిగితే తమ బాధ్యత ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ముందు రోడ్లను బాగుపరచాలని తర్వాతే ఇలాంటి చట్టాలు తేవాలని కోరుతున్నారు. ఇప్పుడున్న డ్రైవింగ్ లైసెన్స్‌లను పూర్తిగా రద్దు చేసి అందరూ మళ్లీ కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లు తీసుకోవాలనే నిబంధన కూడా తెచ్చే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు.
అయితే ఈ బిల్లును పాస్ చేయించడానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. దేశంలో యేటా రోడ్డు ప్రమాదాల వల్ల సుమారు పది వేల మంది వరకు చనిపోతున్నారని మంత్రి గడ్కరీ ఇప్పటికే పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications