సీఏఏ సరికాదన్న శరద్ పవార్, శ్రీలంక తమిళులకు ఎందుకు వద్దు అని ప్రశ్న..
పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతుంటే విపక్షాలు కూడా ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. సీఏఏ చట్టంపై యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ మండిపడ్డారు. మరుసటి రోజు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ గొంతు కలిపారు. దేశ ఐక్యత, అభివృద్ధిని కోరుకునేవారు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.
దేశ ఐక్యతను కోరుకునేవారు సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నారని శదర్ పవార్ తెలిపారు. ఇది మత సామరస్యాన్ని దెబ్బతిస్తోందని పవార్ పేర్కొన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ దేశాలకు చెందిన ముస్లిమేతరులకే ఎందుకు పౌరసత్వం కల్పిస్తారని ప్రశ్నించారు. శ్రీలంక తమిళులను ఎందుకు మినహాయించారని అడిగారు.

పౌరసత్వ సవరణ బిల్లుపై రాష్ట్రాలు కూడా సుముఖంగా లేవని శరద్ పవార్ చెప్పారు. ఎన్డీఏ మిత్రపక్షం జేడీయూ అధికారంలో ఉన్న బీహార్‌లో కూడా వ్యతిరేకత వచ్చినట్టు పేర్కొన్నారు. మొత్తం 8 రాష్ట్రాలు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయని.. అందులో మహారాష్ట్ర కూడా ఉందని పేర్కొన్నారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తప్పుపట్టారు. ఇదే కాదు జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ను కూడా ఆమె వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్యయుతంగా లేదని సోనియాగాంధీ అన్నారు.












Click it and Unblock the Notifications