వెనక్కి తగ్గడం మోడీ రక్తంలోనే లేదు: వెంకయ్య స్పష్టం
ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయడం నరేంద్ర మోడీ రక్తంలోనే లేదని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చరిత్రాత్మకమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అంతేగాక, ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయడం నరేంద్ర మోడీ రక్తంలోనే లేదని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. ఢిల్లీలో జరిగిన మహాపంచాయత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
రూ.500, రూ.1000 నోట్ల అంశంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఆయన ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఈ అంశంపై ప్రతిపక్షాలు సలహాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. నోట్ల రద్దుపై ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని తృణమూల్ కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. విపక్షాలు చర్చ జరగనీయకుండా అడ్డుపడుతున్నాయన్నారు. యూరీ ఘటనలో అమరులైన సైనికులను బ్యాంకు క్యూలల్లో నిలబడి ప్రాణాలు కోల్పోయినవారితో పోల్చడంపై విపక్షాలపై విరుచుకుపడ్డారు. దీనిపై విపక్షాల తీరు దురదృష్టకరమన్నారు. ఈ అంశాన్ని విపక్షాలు రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నాయన్నారు.

మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలకు కొంత ఇబ్బంది కలుగుతుందని తెలిసినప్పటకీ.. క్యాష్‌లెస్ దేశంగా మార్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చలామణీలో ఉన్న రూ.16లక్షల కోట్లకరెన్సీని మార్చడం అంతతేలిక కాదనీ, నోట్ల ముద్రణకు కొంత సమయం కూడా పడుతుంది కదా అని ఆయన అన్నారు.
మొదట నల్లధనాన్ని బయటికి తెచ్చేందుకు మోడీ ప్రయత్నించారని, ఇప్పుడు అసలు నల్లధనమే లేకుండా చేస్తున్నారని అన్నారు. మోడీ తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయంతో దేశంలోని పేదలు, రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో మెరుగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎంపీ పరవేశ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications