ఇండియా కూటమిని ఓడించడం అసాధ్యం: మోడీ సర్కారుపై ఖర్గే, రాహుల్ హాట్ కామెంట్స్
ముంబై: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. మరోవైపు, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముంబైలో విపక్ష కూటమి ఇండియా సమావేశం రెండోరోజు భేటీ సందర్భంగా నేతలంతా సంయుక్తగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడారు.
బీజేపీ పాలనలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. గ్యాస్ ధరను మోడీ సర్కరు రెట్టింపు చేసి.. ఎన్నికల ముందు కంటితుడుపుగా రూ. 200 తగ్గించారని విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైకి వెంటనే ఐటీ, ఈడీ, సీబీఐ వెళ్తోందన్నారు. ఎన్నో కీలక నిర్ణయాలను మోడీ ఏకపక్షంగా తీసుకున్నారని మండిపడ్డారు.

దేశానికి ఇప్పుడు ఇండియా కూటమి గెలవాల్సిన అవసరం ఉందన్నారు ఖర్గే. ఏకపక్షంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశం ఎంతో నష్టపోయిందన్నారు. ప్రణాళిక రహితమైన లాక్‌డౌన్ వల్ల వలస కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. అప్పుడు, మణిపూర్ అల్లర్ల సమయంలో లేనిది.. ఇప్పుడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో తెలియడం లేదన్నారు. త్వరలోనే ఇండియా కూటమి మళ్లీ సమావేశమువుతుందని.. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని ఖర్గే తెలిపారు.
తమ అందరి ఉమ్మడి లక్ష్యం ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై పోరాటమేనని ఖర్గే అన్నారు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు సాయం చేసేందుకు పేదలను దోచేస్తున్నారని ఆరోపించారు. ఈ దోపిడీ ఆపేందుకు ఇండియా కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ ఓటమి ఖాయమంటూ రాహుల్
ఇండియా కూటమిని ఓడించడం బీజేపీ వల్ల కాదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇండియా కూటమిలోని పార్టీల మధ్య ఐక్యత అసాధ్యమని బీజేపీ విమర్శించిందని అన్నారు. అయితే, బీజేపీ అంచనాలు తారుమారు చేస్తూ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు. బీజేపీని ఓడించేందుకు కూటమి బలమైన నిర్ణయాలు తీసుకుందన్నారు.
#WATCH | Mumbai: Congress MP Rahul Gandhi says, "PM Modi thinks that his relations with Gautam Adani can make India Congress-free, but when England was not able to make India Congress-free, how will PM Modi do this?" pic.twitter.com/f3j4jc2Py3
— ANI (@ANI) September 1, 2023
దేశంలో నలుగురికి మాత్రమే మేలు చేసేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని రాహుల్ ఆరోపించారు. ఇండియా కూటమిని ఓడించడం బీజేపీ వల్ల కాదన్నారు. గతవారం లడఖ్‌లో పర్యటించిన తెలిపిన రాహుల్.. చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తోందని చెప్పారు. చైనా ఆక్రమణపై మోడీ మౌనం అవమానకరమని వ్యాఖ్యానించారు. అదానీ గ్రూపుపై అన్ని ఆరోపణలు వస్తుంటే.. విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని.. అదానీ వ్యవహారంపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications