ఇక పాఠ్య పుస్తకాల్లోనూ ఇండియా స్ధానంలో భారత్ పేరు- NCERT కీలక నిర్ణయం..
ఇండియా పేరును భారత్ గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు అంతర్జాతీయ, జాతీయ వేదికలపై వాడేస్తోంది. ఇండియా పేరుకు మరో పేరుగా భారత్ ను అభివర్ణిస్తూ ఇలా అన్ని చోట్లా వాడుతోంది. దీంతో ఇప్పుడు జాతీయ స్ధాయి సంస్ధలు కూడా తమ వాడుకలో ఇండియా పేరు స్ధానంలో భారత్ గా పేరు మార్చుకుంటున్నాయి. ఇదే క్రమంలో హైస్కూల్, ఉన్నత విద్యా స్ధాయిలో పుస్తకాలు ముద్రిస్తున్న జాతీయ విద్యాశిక్షణ, పరిశోధన మండలి ఎన్సీఈఆర్టీ కూడా ఇప్పుడు అదే బాట పట్టింది.
ఇండియా స్ధానంలో పాఠ్యపుస్తకాల్లో భారత్ పేరు వాడేలా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) ప్యానెల్ చేసిన ప్రతిపాదనను దాని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ఇకపై ముద్రించే పుస్తకాల్లో ఇండియా స్ధానంలో భారత్ పేరు కనిపించనుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ముద్రించే పుస్తకాల్లో తాజా మార్పును అమలు చేసే దిశగా ఎన్సీఈర్టీ అడుగులేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జరిగిన జీ20 సదస్సుతో పాటు ఆసియాన్ సదస్సు, ఇతర సందర్భాల్లో ఇండియా పేరుకు బదులు భారత్ పేరుతో అతిథులకు ఆహ్వానాలు పంపింది. దీంతో వారంతా ఆశ్చర్యపోయారు. అయితే ఇండియా పేరుకు బదులుగా భారత్ అనే పేరు అప్పటికే పలు చోట్ల వాడుకలో కూడా ఉండటంతో ప్రభుత్వం చేసిన మార్పును పెద్దగా పట్టించుకోలేదు. అయితే కేంద్రం ఆ తర్వాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ మేరకు బిల్లు ప్రవేశపెడుతుందని ఊహాగానాలు వచ్చినా అలా జరగలేదు.
ఇప్పుడు ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో ఈ మేరకు ఇండియా పేరును భారత్ గా వాడుకునేందుకు ఆమోద ముద్ర వేయడంతో దీనిపై చర్చ జరుగుతోంది. కేంద్రం అధికారికంగా ఇండియా పేరుకు బదులు భారత్ గా వాడాలంటూ ఎక్కడా ఆదేశాలు ఇవ్వకపోయినా ఎన్సీఈఆర్టీ ప్యానెల్ ఇలా నిర్ణయం తీసుకోవడంపై చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications