ఇంటర్ లో బయోలజీ చదవకపోయినా డాక్టర్ కావొచ్చు-మెడికల్ కమిషన్ భారీ ఊరట..
దేశవ్యాప్తంగా వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్దులకు ఇవాళ జాతీయ మెడికల్ కమిషన్ భారీ ఊరటనిచ్చే వార్త చెప్పింది. ముఖ్యంగా ఇంటర్ లో బయోలజీ చదవకుండా డాక్టర్లు కావాలనుకునే వారికి ఇది గొప్ప ఊరటనివ్వబోతోంది. ఇంటర్ లో లేదా ప్లస్ టూ లో బయోలజీ సబ్జెక్టు చదవకపోయినా నీట్ యూజీ ఎంట్రన్స్ రాసేందుకు అవకాశం కల్పిస్తూ జాతీయ మెడికల్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇందుకు కొన్ని షరతులు పెట్టింది.
దేశంలో గుర్తింపు పొందిన ఇంటర్ బోర్డుల నుంచి 12వ తరగతి పాసైన తర్వాత కూడా ఇంగ్లీష్ తో పాటు అదనపు సబ్జెక్టుగా బయోలజీ, ఫిజిక్స్, బయోటెక్నాలజీని చదివేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు మెడికల్ కమిషన్ తెలిపింది. అలా చదివిన విద్యార్దులకు నీట్ యూజీ ఎంట్రన్స్ రాసేందుకు అవకాశం ఇస్తామని వెల్లడించింది. గతంలో ఇలా ఇంటర్ లో బయోలజీ చదవలేదన్న కారణంతో దరఖాస్తులు తిరస్కరించబడిన విద్యార్థులకు కూడా ఈ నిర్ణయం వర్తిస్తుందని నేషనల్ మెడికల్ కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది.

గతంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1997లో గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్‌పై రెగ్యులేషన్స్, అధ్యాయం-II కింద వివిధ సవరణలతో సహా MBBS కోర్సులో ప్రవేశం, ఎంపికలకు అర్హతలు ఖరారు చేసింది. ఇందులో మెడిసిన్ చదవాలనుకునే అభ్యర్థులు 11, 12 తరగతులలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయోటెక్నాలజీ సబ్జెక్టులను ప్రాక్టికల్‌తో పాటు ఇంగ్లీషుతో పాటు రెండేళ్లపాటు రెగ్యులర్ లేదా నిరంతరాయంగా అధ్యయనం చేసి ఉండాలని తెలిపింది. అయితే తాజా మార్పు ప్రకారం బయోలజీ లేకపోయినా ఇంటర్ ను రెగ్యులర్ విధానంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ ఓపెన్ పాఠశాలల నుండి లేదా ప్రైవేట్ అభ్యర్థులుగా చదివితే మాత్రం అర్హులు కారు.












Click it and Unblock the Notifications