• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్: కాకినాడ బీచ్‌లో పల్లీలు అమ్ముకునే వ్యక్తి కోసం 12 ఏళ్లు వెతికిన ఎన్‌ఆర్‌ఐ కుటుంబం... అసలేం జరిగింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

2008 లో ఓ రోజు కాకినాడకు చెందిన మోహన్ నేమాని అనే వ్యక్తి తన పిల్లలతో కలిసి బీచ్‌కు వెళ్లారు. కొంతసేపు అక్కడ గడిపిన తర్వాత పిల్లలిద్దరూ తినడానికి ఏమయినా కావాలని అడగడంతో పల్లీలు కొనుక్కున్నారు.

తీరా తినేసిన పల్లీలకు డబ్బులిద్దామని చూస్తే పర్సు కనిపించలేదు. సముద్ర స్నానానికి వెళుతుండడంతో ముందు జాగ్రత్తగా పర్సు ఇంట్లోనే వదిలి వచ్చిన విషయం మోహన్ మరచిపోయారు. దాంతో అక్కడ సైకిల్ పై తిరుగుతూ పల్లీలు అమ్ముకుంటున్న ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వలేకపోయారు.

అయితే, ఆ వ్యక్తి ఫొటో మాత్రం ఒకటి తీసుకున్నారు. వేరు శనగకాయలు అమ్ముతున్న గింజాల పెద సత్తియ్యతో పాటుగా మోహన్ కుమారుడు ప్రణవ్ నిలబడి ఉన్న ఫొటోను వారు పదిలంగా దాచుకున్నారు.

ఆ తర్వాత కొద్దికాలానికే మోహన్ కుటుంబం అమెరికా వెళ్లిపోయింది. అక్కడే స్థిరపడింది. ఇప్పటికే 12 ఏళ్లుగా ఇండియాకు వచ్చిన ప్రతీసారి ఆ ఫొటో సహాయంతో గింజాల పెద సత్తియ్య కోసం వెతకడం, ఆచూకీ దొరక్క నిరాశతో మళ్లీ అమెరికా వెళ్లిపోవడం వారికి ఆనవాయితీగా మారింది.

అయితే ఈసారి డిసెంబర్ లో ఇండియాకు వచ్చిన మోహన్ కుమారుడు ప్రణవ్ ఏదో విధంగా తమకు వేరు శనగకాయలు అమ్మిన వ్యక్తిని కనుక్కోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. వారి దగ్గర ఫొటో ఉందిగానీ అతని పేరు కూడా తెలియక పోవడంతో అడ్రస్ దొరకడం కష్టమైంది.

https://www.facebook.com/dwarampudiofficial/photos/a.286400238204281/2115307601980193/

ఫేస్ బుక్ పోస్టుతో...

చివరకు మోహన్ తన క్లాస్‌మేట్ అయిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఈ విషయాన్ని చెప్పడంతో గింజాల పెద సత్తియ్య ఎవరన్నది వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 20వ తేదీన ద్వారంపూడి తన ఫేస్‌బుక్ పేజీపై ఓ పోస్టు చేశారు.

గింజాల పెద సత్తియ్య ఫొటో పెట్టి, ఈయన మాకు ఆపద సమయంలో సహాయం చేసిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఇతని గురించి తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని కోరుతూ ఓ ఫోన్ నెంబర్ తో పోస్టు ఉంది.

దాంతో యు. కొత్తపల్లి మండలం నాగులాపల్లికి చెందిన గింజాల పెద సత్తియ్య గురించి తెలిసిన వారు కొందరు స్పందించారు. ప్రస్తుతం గింజాల పెద సత్తియ్య కుటుంబం మూలపేటలో ఉంటున్నట్టు తెలిసిందని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బీబీసీతో అన్నారు.

''వాళ్లు చాలాకాలం నుంచి కలవాలనుకుంటున్నారు. కాకినాడ బీచ్‌లో సైకిల్ పై వచ్చి పల్లీలు అమ్ముకుంటున్నారంటే సమీప గ్రామాల వాళ్లే అయి ఉంటారనుకున్నాం. కొందరిని అడిగినా వివరాలు దొరకలేదు. దాంతో చివరకు ఫేస్‌బుక్ లో పోస్టు పెట్టాం. అలా వచ్చిన వివరాలతో ఆచూకీ తీస్తే కుటుంబం వివరాలు దొరికాయి. దాంతో అమెరికా నుంచి వచ్చి అనేకమార్లు ప్రయత్నం చేసిన మోహన్ కుటుంబానికి 12 ఏళ్ల తర్వాత గింజాల సత్తియ్య ఎవరో తెలిసింది'' అని చంద్రశేఖర్ రెడ్డి వివరించారు.

మూడేళ్ల క్రితమే సత్తియ్య మృతి

''గింజాల పెద సత్తియ్య గురించి తెలిసినప్పటికీ అప్పటికే ఆయన మరణించారని తెలిసి కొంత ఇబ్బంది పడ్డాం. ఆయన బతికి ఉండగా అడ్రస్ పట్టుకోలేక పోయామే అని బాధపడ్డాం. కానీ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఆయన కుటుంబానికి కొంత సహాయం అందించడం ఎంతో సంతృప్తినిచ్చింది'' అని మోహన్ నేమాని అన్నారు.

''12 ఏళ్ల కిందట పల్లీలు తినేసిన తర్వాత డబ్బులు లేక మేము ఇబ్బంది పడుతుంటే ఫర్వాలేదులే..మా బిడ్డలైనా, మీ బిడ్డలైనా ఒకటే అన్నారు. ఇప్పుడు ఆయన కుటుంబం అప్పుల్లో ఉందని తెలిసి మా వంతుగా కొంత తోడ్పాటునిచ్చాం. ఆరోజు మాకు చేసిన సహాయానికి ఈరోజు రుణం తీర్చుకోవడం కొంత తృప్తిగా ఉంది'' అన్నారాయన.

ప్రభుత్వం తరఫు నుంచి కూడా సహాయం అందించాల్సిందిగా చంద్రశేఖర్ రెడ్డి ని కోరినట్లు మోహన్ నేమాని తెలిపారు.

ఇండియాకు వచ్చిన ప్రతీసారి పల్లీల డబ్బులు ఇవ్వకుండానే అమెరికా వెళ్లడం బాధగా ఉండేదని, కానీ ఈసారి వారి కుటుంబం ఆచూకీ దొరకడం, కొంత సహాయం అందించడతో తృప్తిగా అమెరికా చేరుకున్నామని ఆయన బీబీసీతో అన్నారు.

తమ పిల్లలు ఇన్నాళ్లుగా ఆ కుటుంబం గురించి అనేక మార్లు గుర్తు చేస్తూ ఉండేవారని, అప్పటి రుణం తీర్చుకోవడం వల్ల పిల్లలిద్దరూ సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు.

ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన ఫేస్‌బుక్ పేజిలో పెట్టిన విన్నపం

'ఏం జరిగిందో వాళ్లు చెప్పేవరకూ మాకు కూడా తెలీదు'

గింజాల పెద సత్తియ్య కొంతకాలం పాటు గొర్రెల, మేకల పెంచారు. మూలపేటకి మకాం మార్చిన తర్వాత కాకినాడ బీచ్ లో ఏదో ఒకటి అమ్ముకుని జీవించేవారు.

మూలపేట నుంచి రోజూ పది కిలోమీటర్ల దూరం వచ్చి బీచ్‌లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ పల్లీలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించేవారు.

అయితే ఆడబిడ్డల పెళ్లిళ్ల కారణంగా అప్పుల పాలై, వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారని ఆయన భార్య గింజాల గంగమ్మ బీబీసీకి తెలిపారు.

''ఆయన బతికి ఉండగా ఏం జరిగిందో తెలీదు. పది రోజుల కిందట ఓ రోజు కాకినాడ ఎమ్మెల్యే గారు పంపించారని కొందరు వచ్చి వాళ్లింటికి తీసుకెళ్లారు. అక్కడికెళ్లిన తర్వాత చెప్పారు. శనక్కాయలు తిన్నాక పర్సు మర్చిపోయారంట. మీ పిల్లలయినా మా పిల్లయినా ఒకటే అని ఆయన కాయలు ఇచ్చారట. ఆ అభిమానం ఉండిపోయి మాకు ఇప్పుడు పాతిక వేలిచ్చారు. ఆయన శనక్కాయలలు అమ్మి కుటుంబాన్ని పోషించేవారు. ఆయన ఆత్మహత్య తర్వాత ఇంటి మీద కూడా అప్పులయిపోయాయి. మా ఇల్లు కూడా మాకు దక్కేలా లేదు'' అని గంగమ్మ బీబీసీకి వివరించారు.

ముగ్గురు ఆడబిడ్డలు, ఒక అబ్బాయి ఉన్న వారి కుటుంబం అప్పులతో ఉన్నందున ప్రభుత్వం ఆదుకుని సహాయం అందించాలని కోరుతున్నారు.

'సహాయం మరచిపోకపోవడం అభినందనీయం'

''ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫేస్‌బుక్ పేజీలో మా ఊరి వ్యక్తి ఫోటో పెట్టారు ఏంటా అని ఆశ్చర్యపోయాను. పైగా తమకు బాగా సహకరించారనగానే ఎమ్మెల్యేకి సహాయం ఏమిటా అని ఆలోచించాను. సమాచారం ఇవ్వడంతో అసలు విషయం తెలిసింది. ఎప్పుడో పది రూపాయలు బాకీ పడితే, ఇప్పుడు అడ్రస్ కనుక్కుని పాతికవేలు ఇవ్వడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కానీ చేసిన సహాయం మరచిపోకపోవడం మోహన్ వంటి ఎన్నారైల మంచితనానికి నిదర్శనం. ఇలాంటి అనుభవాలు నేటి తరానికి ఆదర్శమవుతాయనిపిస్తోంది'' అని నాగులాపల్లికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ తమిలిశెట్టి సుబ్బిరెడ్డి బీబీసీతో అన్నారు.

గింజాల పెద సత్తియ్య కుటుంబం కష్టాల్లో ఉందని, ప్రభుత్వం స్పందిస్తే కొంత కోలుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
NRI family search for a person who sold groundnuts in Kakinada beach, Here is why
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X