పెద్దమ్మకు చిన్నమ్మల షాక్: కమలం కింద..! (పిక్చర్స్)
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆమె బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడుతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, అగ్రనేత ఎల్‌కె ఆద్వానీ, ఉభయసభల్లో ప్రతిపక్ష నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీని కలుసుకున్నారు.
ఈ భేటీల అనంతరం వెంకయ్యతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. పురందేశ్వరిని తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు వెంకయ్య చెప్పారు. హైదరాబాద్‌లో రాష్ట్ర పార్టీ నేతల సమక్షంలో కూడా ఆమె పార్టీలో చేరతారని తెలిపారు. బిజెపిని, నరేంద్ర మోడీని సమర్థించేవారంతా ఈ పరిణామాన్ని హర్షిస్తారని ఆయన అన్నారు. పదేళ్లుగా ఆమె మంచి పార్లమెంటేరియన్‌గా, మంత్రిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించి గుర్తింపు తెచ్చుకున్నారని వెంకయ్య కొనియాడారు.
పురందేశ్వరికి మంచి వ్యక్తిత్వం, ప్రజాదరణ ఉందన్నారు. ఆమె వల్ల పార్టీకి కూడా ప్రయోజనం ఉంటుందన్నారు. విభజన వల్ల జరిగిన అన్యాయాన్ని ఎవరు పూరించగలరో, ఇచ్చిన హామీలను ఎవరు నెరవేర్చగలరో, ఎవరు అధికారంలోకి రాగలరో అందరికీ తెలుసునని వెంకయ్య వ్యాఖ్యానించారు. తెలంగాణ, సీమాంధ్రలు అభివృద్ధి చెందాలంటే విశ్వసనీయ నాయకత్వం అవసరమన్నారు.

అద్వానీతో పురంధేశ్వరి
తనకు పార్టీ ఎలాంటి దిశానిర్దేశం చేసినా దానికి తగినట్లు బాధ్యతలు నిర్వర్తిస్తానని, తాను బేషరతుగా బిజెపిలో చేరానని పురందేశ్వరి తెలిపారు. జాతీయ పార్టీగా బిజెపికి ఉన్న విస్తృతి దృష్ట్యా ఆ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.

రాజ్‌తో పురంధేశ్వరి
రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడ్డానని, అయితే విభజన జరిగిన తీరును మాత్రం హర్షించలేకపోయానని వివరించారు. విభజన జరుగుతున్నప్పడు సీమాంధ్రకు చేకూర్చాల్సిన ప్రయోజనాల గురించి ఎన్నో ప్రతిపాదనలు చేశామని, కానీ వాటిని ప్రస్తావించకుండానే లోక్‌సభలో బిల్లును ఆమోదించడంతో వెంటనే తాను మంత్రి పదవికి రాజీనామా చేశానని పురందేశ్వరి చెప్పారు.

అద్వానీకి పుష్పగుచ్చం
రాజ్యసభలో వెంకయ్య నాయుడు వంటి నేతలు సీమాంధ్ర ప్రయోజనాల కోసం ఏ విధంగా పట్టుబట్టారో, ఏ పరిస్థితిలో ప్రధాని ప్రకటన చేశారో అందరికీ తెలిసిన విషయమేనని ఆమె అన్నారు.

సుష్మాతో..
మొదట రాజకీయాల నుంచి విరమించుకోవాలని భావించానని, కానీ తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు వారించారని ఆమె చెప్పుకొచ్చారు.

వెంకయ్య, పురంధేశ్వరి
శ్రేయోభిలాషుల సలహాతోనే నిర్ణయం మార్చుకున్నట్లు పురంధేశ్వరి తెలిపారు. బిజెపి సీనియర్ నేతలు అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు తనను సాదరంగా ఆహ్వానించారన్నారు.

కమలం కింద పురంధేశ్వరి
బిజెపి నేతలందరికీ తండ్రి ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానమని పురందేశ్వరి చెప్పారు. జైరాం రమేశ్ తనపై చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యంగా భావించాలన్నారు.

వెంకయ్య నాయుడు
సీమాంధ్రకు ప్యాకేజీ విషయంలో మంత్రులను కేబినెట్‌లో మాట్లాడనివ్వలేదు, మంత్రులు కలిసినా పట్టించుకోలేదని, బిజెపి అడిగిన తర్వాతే కేంద్రం దిగి వచ్చిందని వెంకయ్య నాయుడు చెప్పారు. బిల్లులో పొందుపరిచిన కొన్ని అంశాలు, ప్రాజెక్టులు బిజెపి వల్లే వచ్చాయన్నారు.












Click it and Unblock the Notifications