ఆ ప్రమాదానికి పైలట్ సెల్ఫీలే కారణం: పచ్చికలో దూసుకెళ్లిన మరో విమానం
డెన్వర్/జకార్తా: కాక్‌పిట్‌లో బాధ్యతారహితంగా మొబైల్ ఫోన్‌లో సెల్ఫీ తీసుకోవడమే విమాన ప్రమాదానికి కారణమని అమెరికా విచారణాధికారులు తేల్చారు. గత సంవత్సరం మే 31 తేదీన అమెరికాలోని కొలరాడోలో సమీపంలోని వాట్కిన్స్‌లో జరిగిన ప్రమాద ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు ప్రమాదానికి కారణం పైలట్ అత్యుత్సాహమేనని తేల్చారు.
విమానం గాల్లో ప్రయాణిస్తుండగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి పైలట్ పదే పదే సెల్ఫీలు తీసుకున్నాడని.. దాంతో సెస్నా 150కే విమానం అదుపుతప్పి ప్రమాదానికి గురైందని అధికారులు తేల్చారు. పైలట్ ఉపయోగించిన మొబైల్ ఫోన్ ఆధారంగా ప్రమాద కారణాన్ని గుర్తించామని తెలిపారు. ఈ ఘటనలో పైలట్‌తోపాటు మరో ప్రయాణికుడు మరణించాడు.
రన్ వే పైనుంచి పచ్చికలోకి దూసుకెళ్లిన విమానం

జకార్తా: ఇప్పటికే పలు ప్రమాదాలతో సతమతమవుతున్న ఇండోనేషియా ఎయిర్ లైన్స్.. రన్‌వేపై ఆగిన ఓ జెట్ విమానం పచ్చిక మైదానంలో దూసుకెళ్లడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.
బాలీ ద్వీపం నుంచి వచ్చిన విమానం సెంట్రల్ ఇండోనేషియాలోని లంబాక్ ఐలాండ్ ఎయిర్‌పోర్ట్‌లో ఆగిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. గరుడ ఏటీఆర్ 72-600 విమానం రన్‌వే పైనుంచి పది మీటర్ల దూరం వెళ్లిందని అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నలుగురు విమాన సిబ్బందితోపాటు మొత్తం 29 మంది ప్రయాణికులున్నారు. ఈ ఘటనలో వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, వారందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications