ఒరిస్సాలో పడవ మునక: 24 మంది మృతి, గల్లంతు
భువనేశ్వర్: ఒరిస్సా రాష్ట్రంలోని సంబల్‌పూర్ జిల్లాలోని హిరాకుడ్ రిజర్వాయర్‌లో ఆదివారం జరిగిన పడవ ప్రమాదంలో ఇరవై నాలుగు మంది మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు. 100 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ పడవ బోల్తా పడటంతో ఈ దుర్ఘటన జరిగింది.
మహానది నదిపై నిర్మించిన ఈ రిజర్వాయర్ నుంచి మృతదేహాలను వెలికీ తీసే కార్యక్రమం కొనసాగుతోంది. హిరాకుడ్ రిజర్వాయర్ పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 24కు చేరిందని అధికారులు చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు.

ఇప్పటి వరకు పదమూడు మృతదేహాలను వెలికి తీసినట్లు సోమవారం ఉదయం చెప్పారు. ఎంతమంది గల్లంతయ్యారో అప్పుడే చెప్పలేమని, ఏడెనిమిది మంది ఉండవచ్చునని స్పెషల్ రిళీఫ్ కమిషనర్ పికె మహాపాత్ర చెప్పారు.
రెస్క్యూ ఆపరేషన్లో ఒరిస్సా డిసాస్టర్ ర్యాపిట్ యాక్షన్ ఫోర్స్ పాల్గొంది. ఆరుగురు స్కూబా డైవర్‌లు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. వీరు మునిగిపోయిన పడవ వద్దకు వెళ్లి గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.
కాగా, ఈ ప్రమాదం ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు జరిగింది. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు 350 కిలోమీటర్ల దూరంలో హిరాకుడ్ డ్యాం ఉంది. పడవ సామర్థ్యం 70 కాగా ఇందులో వందమంది దాకా ప్రయాణించారని సమాచారం. సంబల్ పుర్, చుట్టుపక్కల గ్రామస్తులు పిక్‌నిక్‌కు వెళ్లొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూ.1.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.












Click it and Unblock the Notifications