Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒడిశా రైలు ప్రమాదం: లూప్‌లైన్‌ ఎందుకు ఏర్పాటుచేస్తారు, కోరమండల్ ఎక్స్‌ప్రెస్ అందులోకి ఎలా వెళ్లింది?

లూప్ లైన్, రైలు పట్టాలు

ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంపై రైల్వే సిగ్నలింగ్ కంట్రోల్ రూమ్ ప్రాథమిక పరిశీలన నివేదిక రూపొందించింది.

ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు చెన్నైకు వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రధాన రైల్వే లైను (మెయిన్ లైన్)కు బదులుగా లూప్‌లైన్ మీదకు వెళ్లిందని ఆ నివేదికలో పేర్కొన్నారు.

బహానగా బజార్‌ స్టేషన్‌కు కాస్త ముందుగా ఈ లూప్‌లైన్‌లోకి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ వెళ్లినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. ''మొదట ప్రధాన రైల్వే లైన్‌లో వెళ్లేందుకు కోరమండల్‌కు సిగ్నల్ ఇచ్చారు. మళ్లీ దాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో లూప్‌లైన్‌లోకి రైలు వెళ్లింది’’ అని దానిలో తెలిపారు.

ఆ లూప్‌లైన్‌పై అప్పటికే గూడ్స్‌ రైలు ఆగివుంది. దాన్ని గంటకు 127 కి.మీ. వేగంతో ఢీకొట్టడంతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలుతప్పింది. దీంతో కొన్ని బోగీలు పక్కనే ఉన్న ప్రధాన లైను మీదకు వెళ్లాయి.

ఈ ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాలకే గంటకు 116 కి.మీ. వేగంతో హావ్‌డా వెళ్తున్న యశ్వంత్‌నగర్ ఎక్స్‌ప్రెస్ ప్రధాన రైల్వే మీదకు దూసుకొచ్చింది. అప్పటికే పట్టాలు తప్పిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ను ఇది ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం సంభవించింది.

ఇంతకీ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ తీసుకున్న ఆ లూప్‌లైన్ ఏమిటి? ఇలాంటి లైన్‌లను ఎందుకు ఏర్పాటుచేస్తారు?

ఒడిశా రైలు ప్రమాదం

ఏమిటీ లూప్‌లైన్?

రైల్వే స్టేషన్లకు సమీపంలో ప్రధాన రైల్వే లైన్‌లను కలుపుతూ కొన్ని ఇతర లైన్‌లు ఏర్పాటుచేస్తారు. వీటి వల్ల స్టేషన్‌లో ఎక్కువ రైళ్లను నిలిపేందుకు అవకాశం ఉంటుంది. మరోవైపు వేరే రైళ్లకు మార్గం ఇవ్వడం లాంటి ఆపరేషన్లలోనూ ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. కొంతదూరం వెళ్లిన తర్వాత, మళ్లీ ఈ లూప్‌లైన్‌లను ప్రధాన రైల్వే లైన్‌కు కలుపుతారు.

సాధారణంగా లూప్‌లైన్‌లు 750 మీటర్ల పొడవు ఉంటాయి. వీటిపై రెండు ఇంజిన్లతోపాటు మొత్తం రైలును ఆపేందుకు అవకాశం ఉంటుంది.

అయితే, ప్రస్తుతం 1,500 మీటర్ల పొడవుండే లూప్‌లైన్‌లను ఏర్పాటు చేసేందుకు రైల్వే ప్రాధాన్యం ఇస్తోంది. అంటే ప్రస్తుతమున్న లూప్‌లైన్‌లకు రెండింతలు పొడవుండే లైన్‌లను ఏర్పాటుచేస్తోంది.

తాజా ఘటనకు వస్తే, అసలు బహానగా బజార్ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని లూప్‌లైన్ మీదకు కోరమండల్ ఎందుకు రావాల్సి వచ్చింది, దీనికి మానవ తప్పిదం కారణమా? లేదా సాంకేతిక సమస్య కారణమా అనే అంశాల్లో స్పష్టతలేదు. సమగ్ర దర్యాప్తుతోనే ఈ విషయాలు వెలుగులోకి రావచ్చు.

అయితే, తాజా ప్రమాదానికి ''సిగ్నలింగ్ ఫెయిల్యూర్‌’’ కారణం అయ్యుండొచ్చని రైల్వే సీనియర్ అధికారులు చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ ఒక కథనం ప్రచురించింది. ఇంతకీ సిగ్నలింగ్ ఫెయిల్యూర్ అంటే?

ఒడిశా రైలు ప్రమాదం

''సిగ్నలింగ్ ఫెయిల్యూర్’’ అంటే?

రైల్వే మార్గాలను సురక్షితంగా మార్చడంలో ''సిగ్నల్స్’’ ప్రధాన పాత్ర పోషిస్తాయి. రెండు రైళ్ల మధ్య తగిన దూరం ఉండేలా చూడటంతోపాటు రైళ్లు ఢీకొట్టుకోకుండా చూడటంలోనూ ఇవి కీలకంగా పనిచేస్తాయి.

రైల్వే సిగ్నల్స్‌ కూడా రోడ్డుపై ఉండే సిగ్నల్స్‌లానే పనిచేస్తాయి. రెడ్ సిగ్నల్‌ను డ్రైవర్లు ఎప్పుడూ దాటి వెళ్లకూడదు.

ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్, యాక్సెల్ కౌంటర్స్, ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ లాంటి డిజిటల్ టెక్నాలజీలను దీని కోసం రైల్వే ఉపయోగిస్తోంది.

ఒడిశా రైలు ప్రమాదం

ఎలక్ట్రానిక్ ఇంటెర్‌లాకింగ్ సిస్టమ్ (ఈఐ) అనేది మైక్రోప్రాసెసర్ ఆధారిత ఇంటెర్‌లాకింగ్ సిస్టమ్. భిన్న రైళ్ల మధ్య సిగ్నల్స్ సమన్వయంతో ఉండేలా చూడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. రైళ్ల కోసం రూట్‌లను సిద్ధం చేయడం, సిగ్నల్స్ ఇవ్వడానికి దీన్ని ఉపయోగిస్తుంటారు.

ఇక యాక్సెల్ కౌంటెర్స్ (ఏసీ) టెక్నాలజీ ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాల ఆధారంగా పనిచేస్తుంది. పట్టాలపై ఏదైనా ట్రైన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తుంటారు.

ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ (ఏబీసీ) టెక్నాలజీ పట్టాలను భిన్న బ్లాక్‌లుగా విడగొడుతుంది. ఇక్కడ ఒక బ్లాకులో ఒక రైలు మాత్రమే ఉండాలి. దీనికి అనుగుణంగానే సిగ్నిల్స్‌ను ఇస్తుంటారు.

హ్యూమన్ ఎర్రర్, మాన్యువల్ ఇంటర్‌వెన్షన్‌లు వీలైనంత తక్కువగా ఉండేలా చూసేందుకు ఈ టెక్నాలజీలు పనిచేస్తాయి. వీటిలో లోపాలతో ''సిగ్నలింగ్ ఫెయిల్యూర్’’ తలెత్తే అవకాశం ఉంటుంది. ఫలితంగా రైళ్లు వేరే పట్టాలపైకి వెళ్లడం, వేరే రైళ్లను ఢీకొట్టడం లాంటి ప్రమాదాలు జరుగుతాయి.

తాజా ప్రమాదంలో ఎక్కడ లోపం తలెత్తిందో, కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎందుకు లూప్‌లైన్ మీదకు వెళ్లాల్సి వచ్చిందో తెలియాల్సి ఉంది.

ఒడిశా రైలు ప్రమాదం

''కొలీజన్ అవాయిడన్స్ సిస్టమ్’’ ఏమిటి?

అయితే, కవచ్ టెక్నాలజీ అందుబాటులో ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏమిటీ ఆ టెక్నాలజీ?

ట్రెయిన్ కొలీజన్ అవాయిడన్స్ సిస్టమ్ (టీసీఏఎస్)నే కవచ్‌గా పిలుస్తున్నారు. దీన్ని 2011-12లో తీసుకొచ్చారు.

ఈ టెక్నాలజీలో భాగంగా రైళ్లు, సిగ్నలింగ్ వ్యవస్థలతో పాటు రైలు పట్టాల్లో కూడా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ పరికరాలను అమరుస్తారు. అల్ట్రా హై రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఇవి ఒక దాంతో ఒకటి అనుసంధానమై, రైళ్లలోని బ్రేక్స్‌ను నియంత్రిస్తాయి. డ్రైవర్లనూ ఇవి అప్రమత్తం చేస్తాయి.

ఈ టెక్నాలజీలో రైలు కదలికల సమాచారం ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. డ్రైవర్ ఎప్పుడైనా సిగ్నల్ జంప్ చేస్తే ఇది హెచ్చరికలు చేస్తుంది. ఇలా సిగ్నల్ జంప్ చేయడంతోనే చాలా వరకు రైలు ప్రమాదాలు సంభవిస్తుంటాయి.

కచ్చితత్వంతో ప్రమాదాలను నియంత్రించే ఈ వ్యవస్థ ప్రస్తుతం హావ్‌డా-చెన్నై మార్గంలో అందుబాటులో లేదు.

ఒడిశా రైలు ప్రమాదం

డ్యాష్‌బోర్డ్ ఎలా పనిచేస్తుంది?

పట్టాలపై ఎక్కడ ఏ రైలు ఉందో చూపించే డిజిటల్ డ్యాష్‌బోర్డు అందుబాటులో ఉన్నప్పుడు ప్రమాదం ఎలా జరిగిందని కూడా నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఏమిటీ డిజిటల్ డ్యాష్‌బోర్డు?

స్టేషన్ మాస్టర్, రైల్వే గార్డులు, ఇతర సిబ్బందితో రైళ్లను నడిపే లోకోపైలట్ మాట్లాడేందుకు రైళ్లలో డ్యాష్‌బోర్డు అందుబాటులో ఉంటుంది.

అయితే, ఈ డ్యాష్‌బోర్డు అనేది లోకోమోటివ్ ఇంజిన్ మోడల్, టైప్‌ల మీద ఆధారపడి ఉంటుంది.

ఈ డ్యాష్‌బోర్డును లోకోపైలట్‌లు నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎప్పుడు, ఎలా ముందుకు వెళ్లాలో ఇది సూచిస్తుంది.

అయితే, ప్రస్తుత కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఏ మోడల్ డ్యాష్‌బోర్డు ఉంది? గూడ్స్ రైలు పట్టాలపై ఆగుందనే సమాచారం దీనిలో కనిపించిందా? ఒకవేళ కనిపిస్తే, ఎందుకు కోరమండల్ ఆ లూప్‌లైన్‌లోకి వెళ్లింది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+