తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర - నేటి నుంచి అమలు..!!
గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పారు. గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ప్రతీ నెలా ఒకటో తేదీన పెట్రోలియం ఉత్పత్తుల ధరల పైన ఆయిల్ కంపెనీలు సమీక్ష చేసి.. నిర్ణయాలు ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగా తగ్గించిన గ్యాస్ ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రధాన నగరాల్లో అమల్లోకి వచ్చిన ధరలను ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి.
వంట గ్యాస్ ధరలను తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. హోటళ్లు, రెస్టారంట్లు సహా వాణిజ్య అవసరాల కోసం వాడే వాణిజ్య (కమర్షియల్) 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలను రూ. 51.50 మేర తగ్గించినట్లు ప్రకటించాయి. కాగా, గృహ అవసరాల కోసం వినియోగించే 14.2 కిలో సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసాయి. ప్రస్తుతం ఢిల్లీలో 19 కిలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,631.50 ఉండగా తగ్గిన ధరలతో రూ. 1580 కు చేరుకుంది. అదే విధంగా కోల్ కతా, ముంబయి, చెన్నైల్లో ఎల్పీజీ ధరలు వరుసగా రూ.1,684, రూ.1,531, రూ.1,738 కి తగ్గుతాయని ఇండియన్ ఆయిల్ కార్పోరోషన్(ఐఓసీ) తెలిపింది.

అయితే గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్(డొమెస్టిక్) ధరలు ఏప్రిల్ ఎనిమిది నుంచి మార్పు లేకుండా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 853 కాగా చెన్నై, కోల్కతా, ముంబయిలో ధరలు రూ. 868.50, రూ. 879. రూ. 852.50 గా ఉన్నాయని ఐఓసీ తెలిపింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)లు ప్రతి నెల 1వ తేదీన వంట, వాణిజ్య ధరలను సమీక్షించి .. అవసరం మేర నిర్ణయాలు ప్రకటిస్తున్నాయి. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో ఆయిల్ కంపెనీలకు దాదాపు 30 వేల కోట్లు 12 విడతలుగా చెల్లించేందుకు కేంద్రం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications