Manipur violence: మణిపూర్ హింసాకాండపై మేరీ కోమ్ స్పందన.. శాంతంగా ఉండాలని పిలుపు..
మణిపూర్ లో హింసాకాండపై ఒలింపిక్ పతక విజేత, రాజ్యసభ సభ్యురాలు మేరీ కోమ్ స్పందించారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని కోరారు. మెజారిటీ మైతై కమ్యూనిటీని షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కేటగిరీలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనలు హింసకు దారితీశాయి. "మణిపూర్‌లో పరిస్థితి నన్ను అసంతృప్తికి గురిచేసింది. నేను ఇంత హింసను ఊహించలేకపోయాను. గత రాత్రి నుంచి అది మరింత భయానకంగా మారింది" అని మేరీ కోమ్ అన్నారు.
మణిపూర్ లో చెలరేగిన హింసను అరికట్టేందుకు ఆర్మీ, అస్సాం రైఫిల్ బలగాలు రంగంలోకి దిగాయి. పలు చోట్ల ఆర్మీ ఫ్లాగ్ మార్చి నిర్వహించింది. 8 జిల్లాల్లో కర్యూ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.రాజధాని ఇంఫాల్, చురాచాంద్‌పుర్, కాంగ్‌పోక్పిలో ఘర్షణలు జరగడంతో రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

మణిపుర్ జనాభాలో 53 శాతం మంది మైతై వర్గానికి చెందినవారే ఉన్నారు. మణిపుర్ వ్యాలీలో వారి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వస్తోన్న అక్రమ వలసదారులతో తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మణిపుర్‌లో రెండో అతిపెద్ద పట్టణమైన చురాచాంద్‌పుర్ ఈ ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది.
సమాజంలోని రెండు వర్గాల మధ్య అపార్థాలే దీనికి కారణమని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ చెప్పారు. ఇరు వర్గాలతోనూ సంప్రదింపులు జరిపి, వారి సుదీర్ఘ సమస్యలకు పరిష్కారాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.గత 24 గంటల్లో జరిగిన విధ్వంసకాండలో విలువైన ప్రాణాలను కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications