వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒమిక్రాన్-కోవిడ్-19: మీకు కరోనా వచ్చిందని అనుమానంగా ఉందా? ఈ ఆరు పనులు చేయండి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కరోనా పరీక్ష

కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్, మెల్లమెల్లగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. దక్షిణాఫ్రికాలో తొలుత బయటపడిన ఈ వైరస్ ప్రస్తుతం వందకు పైగా దేశాలకు చేరుకుంది.

ప్రపంచంలోని దాదాపు ప్రతీదేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగిపోతోంది. యూరప్, అమెరికాల తర్వాత ఇప్పుడు ఆసియా దేశాల్లో కూడా కరోనా వేగంగా వ్యాప్తిస్తోంది. ఒక్క భారత్‌లోనే గత రెండు రోజులుగా కరోనా కేసులు లక్ష మార్కును దాటి నమోదు అవుతున్నాయి.

చాలాసార్లు మనకు కరోనా సోకినట్లు అనుమానం కలుగుతుంది. దానికి సంబంధించిన లక్షణాలన్నీ కనిపించడంతో పరీక్ష చేయిస్తే కచ్చితంగా పాజిటివ్‌ వస్తుందన్న అనుమానం వస్తుంటుంది.

ఇలాంటి పరిస్థితి ఎదురైతే, మనం ఏం చేయాలి? ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి?

ఈ కింద సూచించిన ఆరు సాధారణ, ప్రాథమికంగా చాలా ముఖ్యమైన మార్గదర్శకాలను పాటించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు, మీ చుట్టూ ఉన్న వారిని సురక్షితంగా ఉంచవచ్చు.

వ్యాక్సిన్

1. అనుమానం వస్తే పరీక్ష చేయించుకోండి

''కరోనా సోకిందో లేదో కచ్చితంగా తెలుసుకోవాలంటే నిర్ధరణ పరీక్ష చేయించుకోవడం అవసరమని'' అని బ్రెజిలియన్ సొసైటీ ఆఫ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ అధ్యక్షుడు డాక్టర్ జోస్ డేవిడ్ అరాబిజ్ బ్రిటో అన్నారు.

''శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించినా లేదా శ్వాస తీసుకునేటప్పుడు ఏదైనా అసాధారణ భావన కలిగినా, దగ్గు, ముక్కు కారడం, గొంతునొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా మీరు సరైన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం'' అని ఆయన చెప్పారు.

ఇలాంటి పరిస్థితి తలెత్తితే, మొదట కరోనా నిర్ధరణ పరీక్ష చేయించుకోవాలి. అప్పుడు మనకు కరోనా సోకిందా, లేదా సాధారణ సీజనల్ వ్యాధి లక్షణాలా అనే సంగతి తెలిసిపోతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఎవరైనా యాంటిజెన్ లేదా ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలి.

ఒకవేళ మీరు కరోనా సోకిన వ్యక్తితో కాంటాక్ట్ అయి ఉంటే గనక కచ్చితంగా కరోనా పరీక్ష చేయించుకోవాలి.

యాంటీజెన్ ర్యాపిడ్ టెస్ట్

యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెబ్‌సైట్ ప్రకారం, ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవడం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏంటంటే... మీరు ఇతర ప్రాంతాలకు ప్రయాణించాలంటే ఈ పరీక్ష ఫలితాన్నే ప్రమాణికంగా తీసుకుంటారు.

యాంటీజెన్‌ పరీక్ష ద్వారా అత్యంత కచ్చితమైన ఫలితాన్ని పొందలేము. కానీ మీకు త్వరగా కరోనా ఫలితం కావాలనుకుంటే మాత్రం యాంటీజెన్ ద్వారా 15 నుంచి 30 నిమిషాల్లో పొందవచ్చు.

మరోవైపు, ఆర్‌టీపీసీఆర్ ఇచ్చే ఫలితాన్ని అత్యంత కచ్చితమైనదిగా పరిగణిస్తారు. కానీ దీని ఫలితం రావడానికి కాస్త సమయం పడుతుంది.

నిర్ధరణ పరీక్షలో నెగెటివ్‌గా వస్తే, మీరు మీ రోజూవారీ పనుల్లో మునిగిపోవచ్చు. కానీ అప్పుడు కూడా మీరు సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మాస్క్ ధరించాలి. బయటి వస్తువుల ఉపరితలాలను, ఇతరులను తగిలినప్పుడు వెంటనే చేతులను శానిటైజ్ చేసుకోవాలి. బయటకి వెళ్లి రాగానే సబ్బుతో శుభ్రంగా కాళ్లు, చేతులు కడుక్కోవాలి.

మరోవైపు నెగెటివ్ రిపోర్టు వచ్చినప్పటికీ, మీరు దిగువ ఇచ్చిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలి.

జలుబుతో బాధపడుతోన్న వ్యక్తి

2. ఒంటరిగా ఉండండి

కరోనా అంటువ్యాధి. పరీక్షలో మీకు కోవిడ్ పాజిటివ్ అని తేలితే ఇంట్లోని కుటుంబ సభ్యులకు దూరంగా ఒక గదిలో ఒంటరిగా ఉండండి.

కరోనావైరస్ సోకిన వ్యక్తి, నోటికి రుమాలు లేదా మాస్క్ ధరించకుండా దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు... అతనికి సమీపంలో మాస్క్ లేకుండా ఉన్న ఆరోగ్యవంతుడైన వ్యక్తికి కూడా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఒకవేళ మీరు కరోనా బారిన పడినట్లయితే, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వారికి వీలైనంత దూరంగా ఉండండి. ఒక గదిలో మీరొక్కరే ఉండండి.

ఇంట్లో మీతో పాటు మీ కుటుంబం నివసిస్తుంటే, వారందరూ తప్పకుండా మాస్కులు ధరించి ఉండేలా చూడటం ముఖ్యం. నాణ్యమైన మాస్కులను వాడాలి. వైరస్ సోకిన వ్యక్తి గది చుట్టుపక్కలా తిరుగుతున్నప్పుడు మాస్కుపై మరింత శ్రద్ధ తీసుకోవాలి.

వీలైతే ఒక బాత్రూమ్‌ను ప్రత్యేకంగా కరోనా సోకిన వ్యక్తికే వదిలేయాలి. వారి వస్తువులను, ఇంట్లోని ఇతర సభ్యుల వస్తువులతో కలిపి ఉంచకూడదు.

వైరస్ సోకిన వ్యక్తి ఎంత కాలం ఐసోలేషన్‌లో ఉండాలనే దానిపై నిపుణులు భిన్నాభిప్రాయాలను కలిగి ఉన్నారు.

కేవలం ఐదు రోజుల ఐసోలేషన్ తప్పనిసరని పేర్కొంటూ యూఎస్ సీడీసీ, డిసెంబర్ 27న మార్గదర్శకాలను మార్చింది. బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఐసోలేషన్ పరిమితి భిన్నంగా ఉంది. కానీ అన్ని దేశాల్లో సగటున ఇది దాదాపు 7 నుంచి 10 రోజులుగా ఉంది. లక్షణాలు కనిపించినప్పటి నుంచి లేదా పరీక్ష ఫలితం వచ్చినప్పటి నుంచి ఐసోలేషన్‌ను ప్రారంభించాలి.

ఎస్‌బీఐ బయోసేఫ్టీ కన్సల్టెంట్ డాక్టర్ సిల్వియా లెమోస్ ప్రకారం... ''ఒమిక్రాన్ వేరియంట్, పెరుగుతోన్న కరోనా కేసుల సంఖ్య ప్రకారం చూస్తే, ఐసోలేషన్ పరిమితిని 10 రోజులుగా ఉంచడం ఉత్తమం''

''ఐసోలేషన్ తొమ్మిదో రోజు కూడా వ్యక్తిలో వైరస్ లక్షణాలు కనిపిస్తుంటే, వారిని పది రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఐసోలేషన్‌లోనే ఉంచాలి'' అని సిల్వియా అన్నారు.

చిన్నారులు

3. మీ చుట్టూ ఉన్న వారికి తెలియజేయండి

మూడో ముఖ్యమైన అంశం ఏంటంటే... మీకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని అనుమానం ఉన్నా, లేక మీరు పాజిటివ్‌గా తేలినా ఆ విషయాన్ని ఇతరుల వద్ద దాచవద్దు.

మీరు కరోనా వైరస్ బారిన పడినా లేదా మీలో ఆ లక్షణాలు కన్పిస్తున్నా... అంతకు 14 రోజుల ముందు, మీరు ఎవరెవరిని కలిశారో వారికి ఈ విషయం చెప్పండి. వారిని కూడా కరోనా పరీక్షకు హాజరు కావాలని సూచించండి.

మీలో లక్షణాలు కనిపించడానికంటే ముందే మీకు వైరస్ సోకి ఉంటుంది. ఎందుకంటే వైరస్ సోకిన తర్వాతే లక్షణాలు కనిపిస్తాయి.

ముందుగా మీరు ఈ విషయాన్ని చెబితే, మీతో కాంటాక్ట్ అయిన వారు అప్రమత్తం అవుతారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ పరీక్ష చేయించుకోవడంతో పాటు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదాన్ని తప్పించుకుంటారు. వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ఇతరులకు కూడా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

ఆక్సీ మీటర్

4. లక్షణాలను గమనిస్తూ ఉండాలి

కరోనా సోకిన చాలా మందిలో జ్వరం, దగ్గు, అలసట, గొంతునొప్పి, డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. చాలా కేసుల్లో సమయం గడిచిన కొద్దీ ఈ లక్షణాలు తీవ్రమవుతుంటాయి.

వైరస్ బాధితుడు ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో అతనిలోని ఈ లక్షణాలను జాగ్రత్తగా గమనిస్తుండాలి. ఇవి రాన్రాను పెరిగిపోతుంటే, వెంటనే డాక్టర్ సహాయం తీసుకోవాలి.

హిన్‌రిచసెన్ ప్రకారం, ''రోగి లక్షణాలను పర్యవేక్షిస్తుండటం చాలా ముఖ్యం. వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 60 ఏళ్లు పైబడిన వారు విపరీతంగా విరోచనాల బారిన పడితే, వారి శరీరం డీహైడ్రేట్ అవుతుంది. లేదా ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల నిమోనియా బారిన కూడా పడొచ్చు''

కరోనా బారిన పడిన వ్యక్తి ఉన్న ఇంట్లో ఒక ఆక్సీమీటర్ ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల క్రమం తప్పకుండా ఆక్సిజన్ స్థాయిలను పరీక్షించవచ్చు.

హిన్‌రిచసెన్ ప్రకారం, ''శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు 95 శాతం కంటే ఎక్కువగా ఉండాలి. ఒక వ్యక్తిని ఆక్సీమీటర్‌తో పరీక్షించినప్పుడు 98 శాతంగా ఉన్న ఆక్సిజన్ స్థాయిలు, రాన్రాను 97%, 96%, 95%, 94 శాతానికి ఇలా పడిపోతుంటే దీన్ని హెచ్చరికగా పరిగణించాలి. తక్షణమే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి''

మంచి నీరు

5. విశ్రాంతి, నీటిని ఎక్కువగా తీసుకోవాలి

కరోనా గురించి బీబీసీతో మాట్లాడిన నిపుణులు, ఒకవేళ వైరస్ సోకితే, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు.

కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చిన కొద్దీ, కొన్ని మందులకు కొరత ఏర్పడింది. ఈ మందులతో వ్యాధి నయం అవుతుందని ప్రజలు భావించడమే ఈ కొరతకు కారణం. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలు హైడ్రాక్సీక్లోరోక్వీన్, ఐవర్‌మెక్టిన్, నైటాజోక్సానైడ్ వంటి ఔషధాలను తీసుకున్నారు. కానీ ఇవి కరోనాపై సమర్థవంతంగా పనిచేసినట్లు రుజువైన దాఖలాలు అయితే కనిపించలేదు.

ప్రస్తుత పరిస్థితుల్లోనైతే, కరోనా సోకిన వ్యక్తిని ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలని, నీళ్లు ఎక్కువగా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

అర్బిజ్ బ్రిటో ప్రకారం... హైడ్రేటెడ్ బాడీ, వైరస్ కణాలను డైల్యూట్ చేసి, అవి మూత్రపిండాల ద్వారా బయటకు వెళ్లేటట్లు చేస్తుంది.

టీకా

6. వైరస్ నుంచి కోలుకున్నాక టీకా తీసుకోండి

కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాక, వైద్య సలహా మేరకు టీకా తీసుకోవాలి.

ఇప్పటికే వైరస్ బారిన పడినవారు కూడా వ్యాక్సీన్ తీసుకోవడం చాలా ముఖ్యం. శరీరంలో యాంటీబాడీల స్థాయిలను పెంచడంలో వ్యాక్సీన్ సహకరిస్తుంది.

పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చిన మరునాడే వ్యాక్సీన్ తీసుకోకూడదు. షెడ్యూల్ సమయంలోగా వ్యాక్సీన్ ప్రతీ డోసును తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Omicron-covid-19: Do you suspect you have corona? Do these six things right away
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X