Omicron: వచ్చే ఏడాది జనవరి 31 వరకు దేశంలో కరోనా ఆంక్షలు పొడిగింపు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అవసరమైతే ఆంక్షలను విధించాలని సూచించింది. దీంతో ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, ఇతర ఆంక్షలను అమలు చేస్తున్నాయి. తాజాగా, కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
Recommended Video

ఆంక్షలు విధించాలంటూ రాష్ట్రాలకు కేంద్రం
కరోనా ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు దేశ వ్యాప్తంగా కరోనా నియంత్రణ చర్యలు అమలును వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగించింది. కొత్త వేడుకల సందర్భంగా ఎక్కడా నిబంధనలు సడలించకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పండగ సీజన్లో రద్దీని నియంత్రించేందుకు అవసరం అనుకుంటే స్థానికంగా ఆంక్షలు, పరిమితులు విధించుకోవచ్చని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలకు సోమవారం లేఖలు రాశారు.

అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం
భౌతిక దూరం, కరోనా నిబంధనల అమలుకు 144 సెక్షన్ కూడా విధించుకోవచ్చని తెలిపారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేయాలన్నారు. ఆక్సిజన్ లభ్యత, మందుల స్టాక్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం సోమవారం నాటికి దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య దాదాపు 600కు చేరింది.

ఇప్పటికే ఆంక్షలు విధిస్తున్న రాష్ట్రాలు
కాగా, దేశ వ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను విధించాయి. మరోవైపు, పలు రాష్ట్రాలు సమూహిక కార్యక్రమాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. సోమవారం సాయంత్రం వరకు భారతదేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 578కి పెరిగింది. ఢిల్లీ, మహారాష్ట్రలో ఒక్కొక్కటి 142 కేసులు నమోదయ్యాయి. తాజాగా, తెలంగాణ రాష్ట్రంలో 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలోని ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరిగింది.












Click it and Unblock the Notifications