జొమాటో షాక్.. 13శాతం ఉద్యోగుల తొలగింపు.. వేతనాల్లో 50శాతం కోత..
జొమాటో ఉద్యోగులకు యాజమాన్యం షాక్ ఇచ్చింది. కరోనా వైరస్‌తో ఏర్పడిన సంక్షోభాన్ని అధిగమించేందుకు ఖర్చును తగ్గించుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా 13 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. ఎంతమందికి ఉద్వాసన పలుకుతారనే నంబర్‌పై స్పష్టత లేనప్పటికీ.. దాదాపు 500 మంది ఉద్యోగులను తప్పిస్తారని అంచనా. గతేడాది సెప్టెంబర్‌లోనూ 540 మంది ఉద్యోగులను తొలగించిన జొమాటో.. మరోసారి లేఆఫ్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ ఏమంటున్నారు..
జొమాటో వ్యవస్థాపకుడు,చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపిందర్ గోయల్ మాట్లాడుతూ.. 'కోవిడ్-19 లాక్ డౌన్ కారణంగా సంస్థపై తీవ్ర ప్రభావం పడింది. దేశవ్యాప్తంగా చాలా రెస్టారెంట్లు శాశ్వతంగా మూతపడ్డాయి. ఇది ఆరంభం మాత్రమే. రాబోయే 6-12 నెలల్లో మరో 25-40శాతం రెస్టారెంట్లు మూతపడుతాయని అంచనా.' అని పేర్కొన్నారు. ఉద్యోగాల కోత మాత్రమే కాదు జొమాటో ఉద్యోగుల వేతనాల్లోనూ తాత్కాలిక కోత తప్పదని ప్రకటించారు.

వేతనాల్లోనూ కోత..
జూన్ నెల నుంచి ఆర్నెళ్ల పాటు జొమాటో ఉద్యోగులందరి వేతనాల్లో కోత తప్పదని దీపిందర్ స్పష్టం చేశారు. తక్కువ వేతనాలు ఉన్నవారికి తక్కువ కోత,ఎక్కువ వేతనాలు అందుకుంటున్నవారికి 50శాతం కోత తప్పదన్నారు. జొమాటోలో వచ్చే ఆర్నెళ్ల పాటు 100శాతం వేతనాన్ని వదులుకోవడానికి ఇప్పటికే స్వచ్చందంగా చాలామంది ముందుకొచ్చారని.. ఇతర సంస్థల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుందని తాను భావించట్లేదని అన్నారు. జొమాటోలో ఉద్యోగాలు కోల్పోయినవారితో సంస్థ సీఓఓ గౌరవ్ గుప్తా,సీఈవో మోహిత్ గుప్తా టచ్‌లో ఉంటారని.. వీలైనంత త్వరగా వారిని ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తారని చెప్పారు. ఆర్థికంగా,మానసికంగా వారికి మద్దతుగా నిలుస్తామన్నారు.

గ్రాసరీ బిజినెస్‌ను విస్తరించే ప్లాన్..
గత నెలలో మరో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా 1000 మంది ఉద్యోగులను తొలగించింది. లాక్ డౌన్‌కు ముందు ప్రతీరోజూ ఈ జొమాటో,స్విగ్గీ సంస్థలకు కనీసం 3 మిలియన్ల ఆర్డర్స్ వచ్చేవి. కానీ ఆ తర్వాత ఆ సంఖ్య చాలా దారుణంగా పడిపోయింది. ఈ నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఇటీవలే జొమాటో గ్రాసరీ(కిరాణ వస్తువుల సప్లై) రంగంలోకి దిగింది. ప్రస్తుతం దేశంలోని 185 నగరాల్లో ఈ సేవలను అందిస్తోంది. త్వరలోనే యూఏఈ,లెబనాన్‌లోనూ దీన్ని లాంచ్ చేసే ఆలోచనలో ఉంది.